తెలంగాణలో పదిలోపే పిల్లలున్న బడులు 4,314.. వాటిలో 3,326 మంది టీచర్లు

తెలంగాణలో పదిలోపే పిల్లలున్న బడులు 4,314.. వాటిలో 3,326 మంది టీచర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో టీచర్లు, విద్యార్థుల వివరాలను స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు సేకరిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1,899 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని అధికారుల పరిశీలనలో తేలింది. అయితే, వీటిలో అప్పటికి 580 మంది టీచర్లు అలాటై ఉండగా, వారందరికీ ఇతర స్కూళ్లకు బదిలీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 4,314 స్కూళ్లలో పది మందిలోపే విద్యార్థులు ఉండగా.. వాటిలో 3,326 మంది టీచర్లు పనిచేస్తున్నారు.  ప్రతి స్కూల్​లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా టీచర్లను కేటాయిస్తున్నారు. ప్రైమరీ స్కూళ్లే కాకుండా.. హైస్కూళ్లలో కూడా జీరో ఎన్​రోల్​మెంట్  నమోదయింది. సింగిల్  డిజిట్  స్కూళ్లూ ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 26,101 బడులు ఉండగా.. వాటిలో 1,899 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఆ బడుల్లో 1818 ప్రైమరీ స్కూళ్లు, 48 యూపీఎస్​లు, 33 హైస్కూళ్లు ఉన్నాయి. 10 మంది దాకా స్టూడెంట్లు ఉన్న ఉన్న స్కూళ్లు 2,415 ఉంటే.. వాటిలో 2,746 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 

పది మంది వరకూ ఎన్​రోల్​మెంట్  ఉన్న స్కూళ్లు 2,312 ఉండగా.. యూపీఎస్​లు 94, హైస్కూళ్లు 9 ఉన్నాయి. అయితే, హైస్కూళ్లలో తక్కువ మంది పిల్లలున్నా.. వారికి ఇబ్బందులు కలగొద్దని టీచర్లను అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. పది మంది వరకూ  పిల్లలున్న స్కూళ్లు 9  ఉంటే.. వాటిలో 45 మంది టీచర్లు ఉన్నారు. ఒక్క విద్యార్థితో నడిచే స్కూళ్లు 53 ఉండగా, వాటిలో 51 మంది టీచర్లు పనిచేస్తున్నారు.

ఇద్దరు స్టూడెంట్లు ఉన్న స్కూళ్లు 142 ఉండగా.. వాటిలో 128  మంది టీచర్లు, ముగ్గురు స్టూడెంట్లున్న బడులు 183 ఉంటే..  183 టీచర్లు, నలుగురు పిల్లలున్న బడులు 247 ఉండగా.. 275 మంది టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,110 బడుల్లో 11 నుంచి 20 లోపు విద్యార్థులు, 3307 స్కూళ్లలో 21 నుంచి 30 మంది, 2540 బడుల్లో 31 నుంచి 40 మంది, 1827 స్కూళ్లలో 41 నుంచి 50  మంది దాకా స్టూడెంట్లు ఉన్నారు. రాష్ట్రంలో 50 మందికిపైగా స్టూడెంట్లున్న స్కూళ్లు 9,963ఉన్నాయి.