
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పీడ్ పెంచారు. బీసీ ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. బీసీ రిజర్వేషన్లే ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి జైలు నుంచి విడుదలయ్యాక కొంత కాలం పాటు అనారోగ్యం కారణంగా బయటికి రాలేదు. తర్వాత బీసీ అజెండాతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆమె అన్ని కార్యక్రమాలను తన సొంత సంస్థ అయిన భారత జాగృతి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఇందిరాపార్కు వద్ద ఆమె ధర్నా నిర్వహించారు.
అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్క రోజు నిరసన తెలిపారు. సరిగ్గా ఆమె ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలోనే కేటీఆర్ తెలంగాణ భవన్ లో చిట్ చాట్ పెట్టారు. అందులో సంచలన విషయాలు బయటపెట్టారు. దీంతో కవిత ధర్నా కాస్తా సైడ్ ట్రాక్ అయ్యింది. మీడియాలో కేటీఆర్ చిట్ చాట్ హైలెట్గా నిలిచింది.
కంచ గచ్చి బౌలి భూముల వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బయటపెడ్తానని చెప్పడంతో ఈ విషయం కాస్తా మీడియాలో హైలెట్ అయ్యింది. దీంతో కవిత ప్రోగ్రామ్ రావాల్సనంత మైలేజ్ రాలేదనేది చర్చనీయాంశమైంది.
కామారెడ్డి మీటింగ్కు ‘గంప’ డుమ్మ
కామారెడ్డిలో వారం రోజుల క్రితం బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ డుమ్మా కొట్టారు. అంతేకాదు తమ వర్గీయులెవరూ వెళ్లకుండా కట్టడి చేశారనే టాక్ ఉంది. స్వయంగా కవిత ఏర్పాటు చేసిన మీటింగ్‌కు వీళ్ళిద్దరూ వెళ్ళకపోవడం పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ మీటింగ్కు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ హాజరయ్యారు.
టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తానోబా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇద్దరు కీలక నేతలు గైర్హాజరైన క్రమంలో రక రకాల ఊహాగానాలు వచ్చాయి. గంప గోవర్ధన్ పార్టీ మారుతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. సీన్ కట్ చేస్తే.. ఆయన మరుసటి రోజ ఎర్రవల్లి ఫాంహౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ కూడా ఉండటం విశేషం.
అదే టైంలో కేటీఆర్ మీటింగ్స్
కవిత తన సొంత సంస్థ భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలోనే కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్లు, చిట్ చాట్లు నిర్వహిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు బీఆర్ఎస్ లోని కీలక నేతలు దూరంగా ఉంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం హాజరవుతున్నారు. కేటీఆర్ నజర్ లో పడొద్దని భావించే కవిత నిర్వహించే మీటింగ్స్ కు బీఆర్ఎస్ లీడర్లు దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది.