* బీఏసీ మీటింగ్స్కు హరీశ్ రావు
* సభకు వస్తున్నా వెళ్లని కేటీఆర్
* కేసీఆర్ తర్వాత ఆయనేనా..?
* ఏడాది దాటినా నియమించని గులాబీ బాస్
* ఇప్పటికే హాట్ టాపిక్గా కేసీఆర్ గైర్హాజరు
* డిప్యూటీ లీడర్ చాన్స్ హరీశ్కేనా..?
హైదరాబాద్: బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువు దీరి ఏడాది గడిచినా గులాబీ పార్టీ ఇప్పటి వరకు ఎల్పీ డిప్యూటీ లీడర్ ను ప్రకటించలేదు. ఎల్పీ లీడర్ గా ఉన్న కేసీఆర్ బడ్జెట్ సెషన్ లో ఒక్క సారే సభకు హాజరయ్యారు. అధికార పక్షం ఎన్నిసార్లు ఆహ్వానించినా అటు వైపు చూడటం లేదు.
ఇటీవల ఫాంహౌస్ కు పిలిచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. సభకు మాత్రం రాలేదు. మొదటి నుంచి బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాలకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరరవుతూ వస్తున్నారు. సభకు రెగ్యులర్ గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నా.. బీఏసీ వైపు చూడటం లేదు. సాధారణంగా ఎల్పీ లీడర్ గైర్హాజరైతే శాసన సభలో ఆ పక్షం బాధ్యతనంతా డిప్యూటీ లీడర్ పర్యవేక్షిస్తారు. అయితే ఇన్ని రోజులు గడిచినా డిప్యూటీ లీడర్ ఎవరన్నది గులాబీ బాస్ తేల్చలేదు.
ALSO READ | పంచాయతీల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో ‘పంచాయతీ’
మండలిలో శాసన సభాపక్ష నేతగా మధుసూదనాచారిని నియమించారు. ఇక్కడ కూడా ఉప నేతను నియమించలేదు. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సాగుతున్నాయి. ఈ సమావేశాలకు మాజీ మంత్రి , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ హాజరవుతున్నారు. బీఆర్ఎస్ పక్షం సభలో అనుసరించాల్సిన వ్యూహం విషయంలో హరీశ్ రావే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన బీఏసీ మీటింగ్ కూడా హరీశ్ రావే హాజరవుతున్నారు. ఆయన వెంట వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్తున్నారు తప్ప.. కేటీఆర్ వెళ్లడం లేదు. దీంతో హరీశ్ రావే డిప్యూటీ లీడర్ గా ఉంటారా... అన్న చర్చ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరవుతుండటంతో ఉప నేత అంశం తెరపైకి వచ్చింది. ఇవాళ జరిగిన బీఏసీ మీటింగ్ కు సైతం హరీశ్ రావే హాజరయ్యారు. కేటీఆర్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. మినహా బీఏసీ మీటింగ్ కోసం వెళ్లలేదు.
గతంలో బీఏసీకి నో పర్మిషన్
ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన అసెంబ్లీ బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ పక్షాన హాజరయ్యేందుకు యత్నించిన హరీశ్ రావు కు ఘోర పరాభవం ఎదురైంది. ఆయనను సమావేశానికి సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనుమతించలేదు. అప్పుడు కడియం శ్రీహరితో కలిసి హరీశ్ రావు స్పీకర్ చాంబర్ కు వెళ్లగా మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
స్పీకర్ ఓకే చెబితేనే వచ్చానని హరీశ్ రావు సమాధానం చెప్పగా, తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్‌బాబు తేల్చి చెప్పారు. సమావేశానికి అనుమతి లేదని చెప్పగా అక్కడి నుంచి హరీశ్ రావు వెనుదిరిగారు. ఆ తర్వాత ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా బీఏసీ సమావేశానికి హరీశ్ రావే హాజరవుతున్నారు. అయితే ఎల్పీ నేత కేసీఆర్ అభ్యర్థన మేరకే అనుమతిస్తున్నట్టు సమాచారం.