
- తండ్రి చనిపోయిన బాధతోనే టెన్త్ ఎగ్జామ్ రాసిన కూతురు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు ‘వీ6 వెలుగు’ రిపోర్టర్ బీబీపేట సత్యనారాయణ (43) మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్‌కు చెందిన సత్యనారాయణ కొంతకాలంగా భిక్కనూరులో నివాసం ఉంటూ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య మంజుల, ముగ్గురు కూతుళ్లు కీర్తన, దీపిక, అనూష ఉన్నారు. కీర్తన, దీపికలు జంగంపల్లిలోని కస్తూర్బా స్కూల్‌లో చదువుతుండగా, అనూష భిక్కనూరు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతోంది.
సత్యనారాయణ మంగళవారం అర్ధరాత్రి సడన్‌గా గుండెపోటుకు గురై ఇంట్లోనే చనిపోయాడు. సత్యనారాయణ డెడ్‌బాడీని సొంతూరు నస్కల్‌కు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి కుటుంబానికి భిక్కనూరు మండల కాంగ్రెస్ నాయకులు రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. రిపోర్టర్ సత్యనారాయణ మృతి పట్ల టీయూడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, ప్రతినిధులు లతీఫ్, శ్రీనివాస్, రాజేశ్ సంతాపం తెలిపారు.
తండ్రి చనిపోయిన బాధలోనే ఎగ్జామ్‌కు...
సత్యనారాయణ పెద్ద కూతురు కీర్తన జంగంపల్లి కస్తూర్బాలో టెన్త్ చదువుతోంది. బుధవారం మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉండగా మంగళవారం రాత్రి తండ్రి చనిపోయినట్లు తెలిసింది. దీంతో పుట్టెడు దుఃఖంలోనూ ఎగ్జామ్‌కు హాజరైంది. పరీక్ష పూర్తయ్యాక కీర్తన, దీపిక స్వగ్రామం వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.