- ప్రాజెక్టును వెంటాడుతున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు
- నీటి కేటాయింపులపై అప్పట్లో అధికారుల అభ్యంతరం
- పోలవరం డైవర్షన్ నీళ్లు 45 టీఎంసీలు తొలుత ఎస్ఎల్బీసీకి వాడుకోవాలని నిర్ణయం
- పాలమూరు –రంగారెడ్డి సోర్స్‌ను శ్రీశైలానికి మార్చాక కేసీఆర్ సర్కార్ డెసిషన్ చేంజ్
హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులు శాపంగా మారాయి. అనుమతుల దగ్గర్నుంచి.. పనుల వరకు అడుగడుగునా గత సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ప్రాజెక్టు విషయంలో మొదటికే మోసం వచ్చింది. మూడేండ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రాజెక్టును తిప్పి తిప్పి తొమ్మిదేండ్ల పాటు సాగదీసింది. సాగునీటిపై దృష్టి పెట్టకుండా కేవలం తాగునీటి కాంపొనెంట్ల పనులను చేపట్టి.. ఆ పనులూ పూర్తికాకముందే హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించింది.
నీటి కేటాయింపులపై సరైన స్టడీ చేయకుండానే సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రాధాన్యపరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టును గత సర్కారు పక్కనపెట్టి.. రికార్డుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి సారించి పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి తప్పులతోనే ఇప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ డీపీఆర్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తిప్పి పంపించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎస్ఎల్ బీసీకి వాడుకోవాల్సిన నీళ్లు..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015 జూన్‌లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.32,500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు ప్రతిపాదించారు. అయితే, ఇప్పుడు ఆ అంచనా వ్యయం దాదాపు రూ.55 వేల కోట్ల వరకు చేరింది. జూరాల నుంచి నీటిని తీసుకునేలా తొలుత ప్రతిపాదించినా.. ఆ తర్వాత సోర్స్‌ను శ్రీశైలానికి మార్చారు. అందుకు మైనర్ ఇరిగేషన్లో రాష్ట్రానికి ఉన్న మిగులు కేటాయింపులు 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి తరలించే నీళ్లలో 45 టీఎంసీల వాటా ఆధారంగా ప్రాజెక్టును మొదలు పెట్టారు.
కానీ, మొదటి నుంచి ఇటు సీడబ్ల్యూసీతోపాటు అటు అధికారులు, ఇరిగేషన్ నిపుణులు అది కరెక్ట్ కాదు అని చెబుతున్నా.. గత సర్కారు మొండిగా ముందుకెళ్లిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి పోలవరం ద్వారా డైవర్ట్ చేసే నీళ్లలో 45 టీఎంసీలను రాష్ట్రంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు ఎస్ఎల్బీసీకి కేటాయించుకునేలా గతంలో అధికారులు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా నిర్ణయాలూ జరిగాయని అంటున్నారు.
కానీ, ఆ తర్వాత పాలమూరు– రంగారెడ్డి సోర్స్‌ను శ్రీశైలానికి మార్చి.. పోలవరం నుంచి వచ్చే నీటి వాటాను పాలమూరుకు వాడుకోవాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దాని వల్ల నీటి కేటాయింపులపై వివాదాలు తలెత్తే ప్రమాదముందని చెప్పినా వినిపించుకోకుండా గత కేసీఆర్ సర్కారు ముందుకెళ్లింది. అయితే, ఎస్ఎల్బీసీకే ఆ నీటిని వాడుకుని ఉంటే కనీసం 30 టీఎంసీలైనా దక్కేవని పలువురు అధికారులు చెబుతున్నారు. మరో 15 టీఎంసీలు తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడేదని అంటున్నారు. కానీ, అలా చేయకపోవడంతో ఇప్పుడు అసలుకే మోసం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు.
ఎస్ఎల్బీసీ నిర్మాణాన్ని వేగవంతం చేసి ఆ నీటిని అప్పుడే వాడుకుంటే ట్రిబ్యునల్‌లోనూ దానిపై వివాదం ఉండకపోయేదని అభిప్రాయపడుతున్నారు. ఆ కేటాయింపులు ఎస్ఎల్ బీసీకి ఇచ్చేస్తే.. ట్రిబ్యునల్ వాదనల తర్వాత కృష్ణా నుంచి ఇప్పుడున్న కేటాయింపులు 299 టీఎంసీలకు అదనంగా కనీసం 150 టీఎంసీలైనా దక్కేవని, ఆ నీటిని పాలమూరు– రంగారెడ్డికి కేటాయించుకుని ఉంటే సమస్యలుండేవి కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ట్రిబ్యునల్వాదనలపై ఎఫెక్ట్?
సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్– 2 (కేడబ్ల్యూడీటీ 2)లో నడుస్తున్న కేసుపై పడే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటిని సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా దొడ్డిదారిలో తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ.. ఇప్పుడు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై మరింత గట్టిగా వాదనలు వినిపించేందుకు ఆస్కారం దొరికిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ట్రిబ్యునల్‌లో ఎత్తి చూపే అవకాశాలున్నాయని, దానికి గట్టి కౌంటర్లు ఇచ్చేలా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు.
అయితే, డీపీఆర్‌లను తిప్పి పంపినా.. మళ్లీ డీపీఆర్‌లను సమర్పిస్తామని అధికారులు అంటున్నారు. కేవలం నీటి కేటాయింపులపైనే సీడబ్ల్యూసీ అభ్యంతరాలు చెప్పిందని, దానిపైనా సీడబ్ల్యూసీకి ఎప్పుడో వివరణ ఇచ్చామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. సీడబ్ల్యూసీ అడిగిన కంప్లయన్స్ రిపోర్ట్‌ను ఈ ఏడాది జూన్‌లోనే పంపించామని, వేరే కారణాలతోనే డీపీఆర్‌లను వెనక్కు పంపించి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటికే చాలా వరకు కాంపొనెంట్ల పనులు నడుస్తున్నాయి కాబట్టి.. కొత్తగా డీపీఆర్‌లను ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదని, ఉన్న డీపీఆర్‌లోనే మార్పులు చేర్పులు చేసి పంపిస్తామని ఆ అధికారి తెలిపారు.
గతంలోనూ పలుసార్లు అభ్యంతరాలు..
వాస్తవానికి ప్రాజెక్ట్ సోర్స్‌ను మార్చి నీటి కేటాయింపులను చేసినప్పటి నుంచే.. దానిపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు చెబుతూనే ఉన్నది. పోలవరం డైవర్షన్ ద్వారా ఏపీకే 45 టీఎంసీలు చెందుతాయని, అలాంటప్పుడు పాలమూరుకు ఎలా వాడుకుంటారని చెబుతూ వస్తున్నది. అయినా దానిపై గత ప్రభుత్వం కనీసం రివ్యూ చేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పరిహారం, భూసేకరణ విషయంలోనూ, పర్యావరణ అనుమతులపైనా సరిగ్గా దృష్టి సారించలేదని చెబుతున్నారు. కేవలం తాగునీటి వరకే సీడబ్ల్యూసీ అనుమతులిచ్చినా.. సాగునీటి అవసరాలకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం విషయంలో విపరీతమైన ఆలస్యం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూసేకరణ విషయంలోనూ అలసత్వం ప్రదర్శించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.