ఉద్యమంలో V6 పాత్ర మరువలేనిది.. తెలంగాణ మాట, పాటను ముందుకు తెచ్చింది: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

ఉద్యమంలో V6 పాత్ర మరువలేనిది.. తెలంగాణ మాట, పాటను ముందుకు తెచ్చింది: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

తెలంగాణ ఉద్యమంలో V6 నిర్వహించిన పాత్ర మరువలేనిదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ మాట, పాటను ముందుకు తెచ్చిన ఘనత V6 ఛానెల్ ది అని అన్నారు. v6 ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారని, V6 అంటే వ్యాపారం కాదని, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన సంస్థ అని ఈ సందర్భంగా చెప్పారు. ఎడిటర్ అంకం రవి ఛానల్ పెట్టాలి అన్నప్పుడు.. వ్యాపారంగా ఉండకూడదని అనుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్, పైడి జయరాజ్, కత్తి కాంతారావు పేర్ల మీద సినీ అవార్డులు ప్రకటించినందుకు నిర్వహిస్తున్న కృతజ్ఞతసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేక్.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం సతోషకరమైన విషయమని అన్నారు. 

హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జై తెలంగాణ ఫిలిం జేఏసీ పంజాల జైహింద్ గౌడ్  ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్, పైడి జయరాజ్, కత్తి కాంతారావు పేర్ల మీద సినీ అవార్డులు ప్రకటించడం గొప్ప విషయమని అన్నారు. 17 సంవత్సరాలుగా పైడి జైరాజు పేరుతో కార్యక్రమాలు చేస్తున్న పంజాల జైహింద్ గౌడ్ కు అభినందనలు తెలిపారు. 

గద్దర్ తో తమకు మంచి అనుబంధం ఉందని, తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాట ఆయుష్సు పోసిందని అన్నారు. కాంతారావు మంచి కళాకారుడని, ఆయన పేరున అవార్డు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్త చరిత్రను ప్రారంభించిందని కొనియాడారు. తెలంగాణ నటుల పేర్లతో అవార్డ్స్ ఇస్తున్న ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

అంతకు ముందు పంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ కళాకారులను గుర్తించాలని, ప్రభుత్వం వెయ్యి కోట్లు పెట్టి కళాకారులను ఆదుకోవాలని కోరారు. దీనిపై మాట్లాడిన వివేక్.. తెలంగాణ ఆర్టిస్ట్ లకు వెయ్యి కోట్ల ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా కాకాను గుర్తు చేస్తున్నారని, కాక కొడుకుగా పుట్టడం అదృష్టం అని ఈ సందర్భంగా అన్నారు.