అందుకే విలన్​ అయ్యా..:వినయ్​రాయ్​

అందుకే విలన్​ అయ్యా..:వినయ్​రాయ్​

దాదాపు పదహారేండ్ల కిందట ‘వాన’ అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమయ్యాడు. అందులో ‘ఆకాశగంగ... దూకావే పెంకితనంగా..’, ఎదుట నిలిచింది చూడు... జలతారు వెన్నలేదో.. మైమరచిపోయా మాయలో...’ అంటూ యూత్​ని తన పాటల మాయలో పడేశాడు. ఆ నటుడి పేరు.. వినయ్ రాయ్.  సాఫ్ట్​గా, లవర్​ బాయ్​లా కనిపించిన అతను ఒక్కసారిగా రూట్ మార్చాడు. విలన్​ రోల్స్ చేస్తూ లవర్​ బాయ్​ కాస్తా సీరియస్​ విలన్​ అయిపోయాడు. ‘డిటెక్టివ్​’ సినిమాలో విలన్​గా చేయడంతో అతని కెరీర్​ యూటర్న్​ తీసుకుంది. ఇప్పుడు వరుసగా నెగెటివ్​ రోల్స్​లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. త్వరలో రాబోతున్న ‘హను-మ్యాన్​’ సినిమాలో నెగెటివ్​ రోల్​తో తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి పలకరించబోతున్నాడు. హీరో నుండి విలన్​గా తన జర్నీ ఎలా సాగిందో తన మాటల్లోనే...

‘‘నేను పుట్టింది ముంబైలో. టీనేజ్​లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ బెంగళూరుకి షిఫ్ట్​ అయింది. అప్పటికి యాక్టింగ్​ గురించి నాకు తెలియదు. అప్పుడు నా ఇంట్రెస్ట్​ అంతా చదువుకోవడం, ఆడుకోవడం మీదనే ఉండేది. సినిమాల్లోకి రాకముందు రెండేండ్లు మోడలింగ్​ చేశా. నిజానికి నేను చాలా సిగ్గరి. దాంతో ర్యాంప్ మీద నడిచే పోటీలకు వెళ్లలేకపోయా. ప్రింట్ యాడ్స్ మీద మాత్రమే ఫోకస్​ చేశా. అయితే ఏ ఫీల్డ్​లో ఉన్నా ఆ పని నువ్వు చేయగలగాలి. చేసేదాన్ని నమ్మాలి. రిజల్ట్ కోసం ఓపిగ్గా ఎదురుచూడాలి– అనే సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా నేను. మోడల్​గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను ‘ఉన్నలే ఉన్నలే’, ‘మోధీ విలయడు’, ‘మిరట్టల్’, ‘ఎండ్రెండుమ్ పున్నగై’ వంటి సినిమాల్లో నటించా. ఆ కంఫర్ట్​ జోన్​ నుంచి బయట పడి నెగెటివ్​ రోల్స్ చేయడం మొదలుపెట్టా. ‘డిటెక్టివ్​’తో నాకు మంచి సక్సెస్ వచ్చింది. నిజంగా అది నా కెరీర్​కి బ్రేక్​ ఇచ్చిన సినిమా. దాదాపు పదేండ్ల కెరీర్​ తర్వాత ఒక్కసారిగా నెగెటివ్​ రోల్​లో కనిపించడం నాకే ఛాలెంజింగ్​​. కానీ, వర్సటైల్​ యాక్టర్​గా ప్రూవ్ చేసుకోవాలనుకునే నాకు ఇదొక మంచి అవకాశం. 

వంద స్క్రిప్ట్​లు రిజెక్ట్ చేశా

నా కెరీర్​ సాఫ్ట్​ బాయ్ క్యారెక్టర్​గా మొదలైంది. కానీ, ఎన్నేండ్లు ఆ క్యారెక్టర్స్ చేయగలను? అనిపించింది. ఎందుకంటే నాకు ‘మంచి యాక్టర్’ అనే కాకుండా ‘వర్సటైల్ యాక్టర్’​ అనిపించుకోవాలనుంది. కానీ ఆ సినిమాల తర్వాత అన్నీ రొమాంటిక్ హీరో పాత్రలే వచ్చాయి. ‘ఉన్నలే ఉన్నలే’ తర్వాత అదే సబ్జెక్ట్​తో చాలా ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు ఆఫర్లను ‘ఓకే’ చేయడం నాకు పెద్ద సాహసంగా మారింది. చాలా కాన్షియస్​గా ఉండి ఆ మూవీస్​ అవాయిడ్​ చేయాల్సి వచ్చేది. అలా జాగ్రత్తగా ఎంచుకున్న స్క్రిప్ట్​ ‘జయంకొండం’. అది రెగ్యులర్ రొమాంటిక్ కామెడీ సినిమాలకంటే కొంచెం ఢిఫరెంట్​గా ఉంటుంది. కానీ, ఈ ఆలోచన కొంతకాలమే ఉంది. ఆ తర్వాత మళ్లీ రొమాంటిక్ ఫిల్మ్స్​లోనే నటించా. అయితే నా టాలెంట్​ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? వేరే పాత్రలు కూడా నేను చేయగలను అని ప్రజలకు ఎలా చూపించాలి? అనే ఆలోచన మాత్రం నన్ను వెంటాడేది. కానీ అప్పుడు నా దగ్గర వేరే ఛాయిస్ లేదు. అందుకని నా మీద నమ్మకం పెట్టి ఒక డైరెక్టర్​ వచ్చే వరకు ఎదురుచూడాలి అనుకున్నా. అలా నమ్మకం పెట్టి వచ్చిన డైరెక్టర్​​ మిస్కిన్​. ఆ​ క్యారెక్టర్​లో నన్ను నేను చూసుకుని చాలా థ్రిల్​ అయ్యా. ఆ రోల్​ గురించి డైరెక్టర్​ చాలా శ్రద్ధ తీసుకున్నాడు. నా హెయిర్​ స్టయిల్​తో సహా అన్నీ పర్ఫెక్ట్​గా ఉండేలా చూసుకున్నాడు. కాబట్టి, ఆ సినిమాకి నాకు వచ్చిన అప్రిసియేషన్స్ అన్నీ డైరెక్టర్​ మిస్కిన్​కే సొంతం. 

డైరెక్టర్స్ నమ్మారు

‘మోధీ విలైయడు’ టైంలో నా దగ్గర చాలా మూవీ ఆఫర్స్ ఉన్నాయి. కానీ, ఆ తర్వాత రెండేండ్లు నాకు పనే లేకుండా పోయింది. నా మార్కెట్​ పడిపోయిన టైంలో డైరెక్టర్ మధేశ్‘మిరట్టల్’ వంటి కమర్షియల్ సినిమా అవకాశం ఇచ్చాడు నాకు. తర్వాత డైరెక్టర్ సుందర్​ సి. ‘అరన్​మనయ్’తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వీళ్లిద్దరూ నా వర్క్​ని నమ్మడం వల్లే నాకు అవకాశం ఇచ్చారు. మిస్కిన్, శరణ్​​ కూడా అంతే.. నా పనిని నమ్మి అవకాశాలిచ్చారు. అందుకే ఫ్రెండ్స్, రిలేటివ్స్ తర్వాత నేను విలువ ఇచ్చేది డైరెక్టర్స్​కే. నిజం చెప్పాలంటే.. నాకు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్​ లేదు. ఎవరూ నాకు అవకాశాలు తీసుకొచ్చి చేతిలో పెట్టలేదు. నాకు వచ్చిన సినిమాలన్నింటి వెనక నా హార్డ్​ వర్క్​, డైరెక్టర్స్​కి నా యాక్టింగ్​ కెపాసిటీపైన ఉన్న​ నమ్మకం, అదృష్టం ఉన్నాయి. 

తెలుగులో ఆ ఒక్కటే

ఎం.ఎస్. రాజు డైరెక్షన్​లో ‘వాన’ సినిమాలో నటించా. అది నా రెండో సినిమా. ఆ సినిమా తమిళంలో హిట్​ అయింది. తెలుగులో పాటలు మాత్రం బాగా హిట్ అయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే మ్యూజికల్ హిట్. ఇప్పటికీ ఆ సినిమా పాటలు అక్కడో.. ఇక్కడో.. వినిపిస్తూ ఉంటాయి. కానీ, తెలుగులో డైరెక్ట్​గా నేను నటించిన సినిమా ఒక్కటే... అది అంతగా హిట్ కాకపోయినా ఆడియెన్స్​ నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత తమిళంలో నేను నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో కనిపించే ఛాన్స్ వచ్చింది. ‘హను– మ్యాన్​’లో నేను ఒక మంచి రోల్​లో కనిపించబోతున్నా. 

ఇప్పుడు అది నేర్చుకున్నా

2009 –2010 మధ్యలో ఒక డైరెక్టర్​ నాకు విలన్​ రోల్ ఆఫర్ చేశాడు. ‘నేను చేయను’ అని చెప్పా. హీరోగా ఉన్న మార్కెట్ వదులుకుని విలన్​ రోల్స్ చేస్తే తర్వాత హీరో రోల్స్​కి పిలవరు అనే భయం ఉండేది. అందుకని నేను అప్పట్లో విలన్​ రోల్​కి ‘నో’  చెప్పా. ఇదే విషయాన్ని విజయ్ సేతుపతిని కలిసినప్పుడు ఆయనతో చెప్పా. హీరోగా, విలన్​గా రెండూ ఒకేసారి చేయడం ఆయన వల్లే సాధ్యమైంది. ఆఫర్ వచ్చింది అంటే అతను చేసేస్తాడు. అది నాకు ఒక గుణపాఠం నేర్పించింది. నేను అప్పట్లో ఎన్ని అవకాశాలు మిస్​ అయ్యానో తెలిసి వచ్చింది. ఆ తరువాత నుంచి వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా చేస్తున్నా.   

మరికొన్ని సంగతులు

బహ్రెయిన్​లో 2001లో జరిగిన రగ్బీ టీంలో మెంబర్​ని నేను. ఉన్నలే ఉన్నలే’ తర్వాత ‘జయం కొండమ్’ ఒప్పుకునేవరకు దాదాపు వంద స్క్రిప్ట్​లు రిజెక్ట్ చేసి ఉంటా. ఈటీ’లో సూర్యతో స్క్రీన్​ షేర్​ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన యాక్టింగ్​ ముందు నా యాక్టింగ్ సరిపోదు. షూటింగ్​ టైంలో మేమంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. నాకు ద్విపాత్రాభినయం చేయడం అంటే ఇంట్రెస్ట్​. అందుకే ‘ఆయిరతిల్​ ఇరువార్’లో ఆ అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకున్నా. ఆ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే రీజన్.  డిటెక్టివ్’ సినిమా తర్వాత ‘డాక్టర్, ఓమై డాగ్, క్రిస్టఫర్’ వంటి వాటిల్లో నటించా. క్రిస్టఫర్ సినిమాకు పది రోజులు నటించానంతే. కానీ, ఆ కొంచెం టైంలో టీంతో చాలా ఎంజాయ్ చేశా. నిజానికి పదిహేనేండ్లుగా ఇలాంటి అవకాశమే కోసం ఎదురుచూశా. మలయాళంలో నా మొదటి సినిమా ఇది. మమ్ముట్టి సినిమాలో నేను విలన్​గా నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ మూవీలో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది..

బిగ్​ బ్రేక్​ అదే

నా మొదటి సినిమా 2007లో వచ్చింది. ఆ తర్వాత నా కెరీర్​కి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే ‘డిటెక్టివ్​ (తుప్పరివాలం)’. ‘డిటెక్టివ్​’ సినిమా తర్వాత మళ్లీ అలాంటి ఫేజ్ ఎదుర్కొన్నా. అన్నీ విలన్​ రోల్ ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకుంటే ఒకే రకమైన పాత్రల్లో కనిపించాలని నాకు లేదు. డిటెక్టివ్ సినిమాలో విశాల్​తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్షన్​ సీన్స్​లో నా హైట్​ నాకు ప్లస్ అయింది. 
::: ప్రజ్ఞ