- నల్గొండ జిల్లాలో అన్ని కేటగిరీల్లో సుమారు 1100 ఖాళీలు
- లాంగ్ స్టాండింగ్ టీచర్లు 1500, ప్రమోషన్ల పొందే వారు 300
- వివరాలువెబ్‌సైట్ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేసిన విద్యాశాఖ ఆఫీసర్లు
నల్గొండ,వెలుగు: నల్గొండ జిల్లాలో టీచర్ల క్లియర్ వేకెన్సీలు, ప్రమోషన్ల లెక్క తేలింది. ఎనిమిదేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న టీచర్లతో పాటు, ప్రమోషన్లు పొందే టీచర్ల వివరాలను సైతం ఆఫీసర్లు సేకరించారు. గురువారం ఎంఈవోలతో మీటింగ్ పెట్టిన విద్యాశాఖ అధికారులు రాత్రి వరకు ఖాళీలపైనే కుస్తీ పట్టారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1,483 పీఎస్‌లు, యూపీఎస్, హైస్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఇతర అన్ని కేటగిరీల్లో కలిపి 1000 నుంచి 1100 వరకు క్లియర్ వేకెన్సీలు ఉండొచ్చని ఆఫీసర్లు తెలిపారు. ఇందులో ఎస్‌జీటీలు 400, హెచ్‌ఎంలు, పండిట్లు కలిపి 100 ఉండగా, మరో 500ల వరకు స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలుఉండే చాన్స్ ఉంది. ఎనిమిదేళ్ల సర్వీస్ కంప్లీట్ అయిన స్కూల్ అసిస్టెంట్లు, ఐదేళ్ల సర్వీస్ కంప్లీట్ అయిన హెచ్‌ఎంలు మరో 1500 మంది ఉంటారు. ప్రమోషన్ల కేటగిరీలో హెచ్‌ఎంలు, పండిట్లు కలిపి 300 వరకు ఉంటారని ఆఫీసర్లు తెలిపారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను గురువారం అర్ధరాత్రి వరకు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని డీఈవో భిక్షపతి తెలిపారు.
317 జీవోపైనే టీచర్ల లొల్లి
2015లో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టగా 2018 తర్వాత ట్రాన్స్‌ఫర్లు చేయలేదు. గతేడాది ప్రభుత్వం తెచ్చిన 317 జీవో వల్ల టీచర్లు వేర్వేరు ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. దీనివల్ల తాము నష్టపోయామని చాలా మంది టీచర్లు ఆందోళన చేశారు. 317జీవోతో సేఫ్ జోన్‌లో ఉన్న టీచర్లను ఇతర జిల్లాలకు బలవంతంగా గెంటేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ల అంశాన్ని తెరపైకి తేవడంతో 317 జీవో కారణంగా బదిలీ అయిన టీచర్లు తిరిగి సొంత జిల్లాలకు వచ్చే అవకాశం కల్పించాలని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని చోట్ల అవసరం లేకున్నా టీచర్లను ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల ఇప్పటికీ ఆ స్కూళ్లలో ఎలాంటి మార్పు రాకపోగా స్టూడెంట్లు లేనిచోట కూడా పని చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్‌లో 317 జీవోతో ఎఫెక్ట్ అయిన టీచర్లకు అవకాశం కల్పించాలని, దాంతో పాటు దూర ప్రాంతాలకు బదిలీ అయిన టీచర్లకు కౌన్సెలింగ్‌లో అదనపు పాయింట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో ప్రైమరీ స్కూల్‌కు హెచ్‌ఎం పోస్టు ఇవ్వాలని, దీంతో పాటు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులు సైతం మంజూరు చేయాలని సంఘాల లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. 317 జీవోతో మారుమూల ప్రాంతాలకు బదిలీ అయిన టీచర్లు రాజకీయ పలుకుబడితో డిప్యుటేషన్లపైన కొనసాగుతున్నారు. దీని వల్ల హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ల కొరత ఏర్పడింది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, తెలుగు చెప్పే టీచర్లు లేకపోవడంతో స్టూడెంట్లు నష్టపోతున్నారు. డిప్యుటేషన్లు రద్దు చేసి పొరుగు జిల్లాలకు వెళ్లిన టీచర్లకు తిరిగి అవకాశం కల్పించాలని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఖాళీలు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తాం
టీచర్ల ప్రమోషన్లు, ఖాళీలకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తిచేశాం. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మరోసారి పునఃపరిశీలన చేస్తాం. వివరాలను కేటగిరీల వారీగా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించగానే పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాం.
- భిక్షపతి, డీఈవో, నల్గొండ