సుజాతనగర్, వెలుగు: మండల కేంద్రంలోని జీపీలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు గత ఐదేళ్లుగా నెలకు రూ.17 వేల చొప్పున జీతం చెల్లిస్తున్నారు. జీపీలో కంప్యూటర్ ఆపరేటర్ నిర్వహణ సెక్రెటరీ చేస్తుండగా ఆఫీసులో లేని పోస్టుకు జీపీ అకౌంట్ నుంచి ప్రతీ నెలా జీతం చెల్లిస్తూనే ఉన్నారు.
ఇది అధికారులకు తెలియదా? లేక తెలిసే జరుగుతుందా అని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కనీసం పాలకవర్గమైనా దీనిపై ప్రశ్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సెక్రెటరీని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ లేక అన్ని పనులు తానే చేస్తున్నానని చెప్పడం కొసమెరుపు.
కంప్యూటర్ ఆపరేటర్ పని కూడా సెక్రెటరీనే చేస్తే మరి నెలనెలా జీతం ఎవరికి చెల్లిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.