గర్భిణులకు కరోనా వ్యాక్సిన్​..పుట్టబోయే పిల్లలకు యాంటిబాడీలు

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వ్యాక్సిన్ వేసుకోవాలంటే గర్భిణులు భయపడుతున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ శాతం మంది ప్రెగ్నెంట్లు మాత్రమే టీకా తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన రీసెర్చర్ల టీమ్ కీలక విషయాలు వెల్లడించింది. ఎంఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న గర్భిణుల నుంచి పిల్లలకు మస్తు యాంటిబాడీలు వస్తాయని తెలిపింది. ఎలాంటి భయం లేకుండా ప్రెగ్నెంట్లు కరోనా టీకా తీసుకోవచ్చని, వారి నుంచి అధిక సంఖ్యలో యాంటిబాడీలు బిడ్డలకు వెళ్తున్నాయని చెప్పింది. మోడెర్నా/ఫైజర్ టీకా వేసుకున్న 36 మంది గర్భిణులు ప్రసవించిన తర్వాత పిల్లల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ పిల్లలు అందరిలోనూ అధిక స్థాయిలో యాంటిబాడీలు(యాంటీఎస్ఐజీజీ) ఉన్నాయని టెస్టుల్లో తేలింది. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్ టీమ్ ఈ స్టడీ చేసింది. 

పుట్టిన తర్వాత ఉంటాయా?

బొడ్డుతాడు రక్తంలో ఉన్న యాంటిబాడీల స్థాయిలను రీసెర్చర్ల టీమ్ పరిశీలించింది. ఆ యాంటిబాడీలు కరోనా సోకడం వల్ల వచ్చాయా, లేక టీకా తీసుకున్నందు వల్ల వచ్చాయా అనే దానిపై రీసెర్చ్ చేసింది. ‘‘శాంపిల్ సైజ్ చాలా చిన్నది. అయినప్పటికీ గర్భిణులకు టీకా వేశాక చిన్నారుల్లో యాంటిబాడీ స్థాయిలు పెరగడం మంచి పరిణామం” అని అసోసియేట్ ప్రొఫెసర్ జెన్నీఫర్ ఎల్.లైటర్ చెప్పారు. ‘‘ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు.. సరైన యాంటిబాడీస్, బ్లడ్ ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రేరేపించే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడు తల్లి నుంచి బిడ్డకు వచ్చే ప్రోటీన్లు..  పుట్టిన తర్వాత ఉంటాయా లేదా అనేది తెలుసుకోవాలె” అని రీసెర్చర్లు చెప్పారు. 

రెండు ప్రాణాలు కాపాడుకోవచ్చు..

‘‘గర్భిణులు టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యమని స్టడీలు పదేపదే చెబుతున్నాయి. తీవ్రమైన అనారోగ్యం కలగకుండా ఆడ్డుకునే శక్తి వాటికి ఉంది. రెండు ప్రాణాలను కాపాడుకోవచ్చు. పిల్లలు యాంటిబాడీలతో పుడితే.. ఒకవేళ వైరస్ సోకినా కొన్ని నెలలపాటు వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు” అని ప్రొఫెసర్ ఆశ్లే ఎస్.రోమన్ చెప్పారు. గర్భిణులకు ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్ఏ వ్యాక్సిన్లు సేఫ్ అని, ఎలాంటి సమస్యలు తలెత్తవని ఆగస్టు 16న ప్రచురించిన స్టడీలో రోమన్ టీమ్ వెల్లడించింది. ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.