మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 30 మంది చిన్నారులకు ఒకే సిరంజీ ఉపయోగించి వ్యాక్సిన్ వేసిన విషయం బయటపడింది. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం, వ్యాక్సిన నిబంధనలు ఉల్లంఘించడంతో వ్యాక్సినేటర్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని ఓ స్కూల్లో బుధవారం వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. జితేంద్ర అనే వ్యాక్సినేటర్ కు ఆ బాధ్యత అప్పగించారు. అయితే సదరు వ్యక్తి ఒక్క సిరంజీని ఉపయోగించి 30 మంది విద్యార్థులకు టీకా వేశాడు. ఇంటికెళ్లిన పిల్లలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా అక్కడికి వచ్చి జితేంద్రను నిలదీశారు. ఒకే సిరంజీ ఎందుకు ఉపయోగించావని ప్రశ్నించగా.. డిపార్ట్ మెంట్ హెడ్ ఒకే సిరంజీ పంపాడని, దానితోనే అందరికీ వ్యాక్సిన్ వేయాలని ఆదేశించినట్లు చెప్పాడు. ఒకే సిరంజీని ఉపయోగించొద్దన్న విషయం తెలిసినా పై అధికారి చెప్పడంతోనే అలా చేశానని, అందులో తన తప్పేంలేదని బుకాయించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
30 మంది విద్యార్థులకు ఒకే సిరంజీ ఉపయోగించిన విషయం తెలిసిన సాగర్ జిల్లా అధికారులు వ్యాక్సినేటర్ జితేంద్రపై చర్యలు తీసుకున్నారు. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ విధానాన్ని ఉల్లంఘించినందుకుగానూ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జితేంద్రతో పాటు వ్యాక్సిన్, ఇతర మెటీరియల్ పంపించే జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్‌పైనా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు.