సూపర్ స్ప్రెడర్లకు రేపటి నుంచి వ్యాక్సినేషన్

సూపర్ స్ప్రెడర్లకు రేపటి నుంచి వ్యాక్సినేషన్
  • హైదరాబాద్​లో 10 రోజుల్లో 3 లక్షల మందికి టీకా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో సూపర్ స్ప్రెడర్లకు శుక్రవారం నుంచి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు బల్దియా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తవారి వివరాలు సేకరించడంతోపాటు ఇప్పటికే తమ వద్ద ఉన్న జాబితా ప్రకారం గురువారం నుంచి టోకెన్లు జారీ చేసేందుకు రెడీ అయింది. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన స్ట్రీట్ వెండర్స్, చికెన్, ఫిష్, కూరగాయల అమ్మకం దారులు, కిరాణ, వైన్స్, సెలూన్స్, లాండ్రీ, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్స్ సిబ్బంది, ఆటో, క్యాబ్​ డ్రైవర్లకు టీకాలు ఇవ్వడంలో అధికారులు ప్రయార్టీ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 30 సర్కిల్స్​లో 32 సెంటర్స్​ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఫంక్షన్​హాల్స్, మల్టీపర్పస్​ హాల్స్, స్కూల్స్, స్టేడియాలను వినియోగిస్తారు. ఏ సెంటర్​లో, ఎన్ని గంటలకు టీకా వేస్తారనే విషయాలను టోకెన్​ ఇష్యూ టైమ్​లోనే చెబుతారు. ఒక్కో సెంటర్​లో డైలీ వెయ్యి మందికి టీకా  వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజులపాటు దాదాపు 3 లక్షల మందికి టీకా వేయనున్నారు. హైదరాబాద్​లో  స్ట్రీట్​ వెండర్స్​ సమాచారం అధికారుల వద్ద ఉంది. ట్రేడ్ లైసెన్స్​ల ఆధారంగా షాపుల వివరాలు కూడా ఉన్నాయి.  రైతు బజార్లు, ఫ్లవర్​ మార్కెట్లలో ఎంత మందికి టీకా వేయాల్సి ఉంటుందన్న దానిపై సమాచారం సేకరించనున్నారు. ఆటో, క్యాబ్​ డ్రైవర్ల వివరాలు పోలీస్​ డిపార్ట్​మెంట్​ నుంచి తీసుకుంటున్నారు. ఇంకా మిగిలిఉన్న వారి వివరాలను సేకరించి టోకెన్లు జారీ చేస్తారు.