కరోనా వైరస్‌కు టీకా? ఇండియన్‌  సైంటిస్ట్ ముందడుగు

కరోనా వైరస్‌కు టీకా? ఇండియన్‌  సైంటిస్ట్ ముందడుగు

ఆస్ట్రేలియాలో ఇండియన్‌  సైంటిస్ట్ టీం ముందడుగు

చైనాలో పుట్టి, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొత్త కరోనా వైరస్ ఆటకట్టించే దిశగా ఆస్ట్రేలియాలోని ఓ ఇండియన్ సైంటిస్ట్ ఆధ్వర్యంలోని బృందం కీలక విజయం సాధించింది. మనిషి రక్తం శాంపిళ్ల నుంచి వైరస్‌‌ను వేరు చేయడమే కాకుండా.. ల్యాబ్ లో ఆ వైరస్‌‌ల సంఖ్యను ప్రయోగాలకు అవసరమైనంత మొత్తంలో పెంచగలిగారు. ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ)లో కరోనా వైరస్ టీకా తయారీ కోసం ‘డేంజరస్ పాథోజన్స్ టీమ్’ ఈ రీసెర్చ్ చేస్తోంది. దీనికి ఇండియన్ సైంటిస్ట్, ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ నాయకత్వం వహిస్తున్నారు. ‘‘కొత్త కరోనా వైరస్‌‌కు టీకా తయారీ కోసం ప్రీక్లినికల్ స్టడీస్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున వైరస్ అవసరం. ఆ మేరకు వైరస్‌‌ను హై సెక్యూరిటీ ల్యాబ్‌‌లో పెంచగలిగాం. వివిధ టీకాలతో వీటిపై ప్రయోగాలు చేస్తాం” అని ప్రొఫెసర్ వాసన్ తెలిపారు. ప్రొఫెసర్ వాసన్ బిట్స్ పిలానీ, ఐఐఎస్సీ బెంగళూరులో చదువుకున్నారు.  ఆక్స్‌‌ఫర్డ్ వర్సిటీలో డెంగీ, చికున్ గున్యా, జికా వైరస్‌‌లపైనా ఆయన రీసెర్చ్ చేశారు.

31 వేలు దాటిన కేసులు.. 636 మంది మృతి

కరోనా వల్ల చనిపోయినోళ్ల సంఖ్య 636కు పెరిగింది. గురువారం ఒక్కరోజే 73 మంది మరణించారు. ఈ వైరస్ సోకినోళ్ల సంఖ్య 31 వేలు దాటిపోయిందని శుక్రవారం చైనీస్ హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ శుక్రవారం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు తాము ‘పీపుల్స్ వార్’ను ప్రకటించామని చెప్పారు. జపాన్ క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్ లో 61 మందికి కరోనా వైరస్ కన్ఫమ్ అయింది. రెండు వారాల క్రితం జపాన్ తీరానికి చేరుకున్న ఈ షిప్‌‌లో ప్రస్తుతం 3,700 మంది ప్యాసింజర్లు ఉన్నారు.

డాక్టర్ మృతిపై విచారణ

చైనాలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు ముందే వెల్లడించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ గురువారం చనిపోయారు. కరోనా గురించి ఆయన డిసెంబర్ 30న వీచాట్ లో వెల్లడించగా, ఆయనతో పాటు ఏడుగురిని పోలీసులు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ రిప్ రిమాండ్ చేశారు. తాజాగా ఆయన వైరస్ వల్లే చనిపోయారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతుండటంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

అతిపెద్ద కార్ల ప్లాంట్‌‌లో ప్రొడక్షన్‌‌ స్టాప్‌‌

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల ప్లాంట్‌‌పై కరోనా ఎఫెక్ట్‌‌ పడింది. దక్షిణకొరియాలోని హ్యుందాయ్ కంపెనీ ఉల్సన్ కాంప్లెక్స్‌‌లో శుక్రవారం విడి భాగాలు లేక పని బంద్ అయింది. చైనాలో కరోనా ఎఫెక్ట్‌‌తో ఇండస్ట్రీలు మూతపడడం వల్ల  విడి భాగాల కొరత ఏర్పడింది. దీంతో హ్యుందాయ్ కాంప్లెక్స్ లో ఆపరేషన్లను ఆ కంపెనీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా యూనిట్లలో 25 వేల మందిని ఈ కంపెనీ లీవ్ పై పంపడం, జీతాల్లో కోత పెట్టడం వంటివి అమలు చేస్తోంది.