- ఒక్కో సర్కిల్‌లో రోజూ వేయి మందికి టోకెన్లు
- గ్రేటర్ హైదరాబాద్‌లో పది రోజుల్లో పూర్తి
- 32 వ్యాక్సిన్ సెంటర్లు.. ఒక్కో చోట 10 కౌంటర్లు
- టీకా కేంద్రాల్లో వైరస్ స్ప్రెడ్‌కు చాన్స్ లేకుండా ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా టైమ్‌లోనూ రిస్క్ తీసుకుని జనం మధ్యకు వచ్చి సర్వీస్ చేస్తున్న హైరిస్క్ గ్రూప్‌లో ఉన్న వారికి శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతోంది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్‌లోని రిస్క్ టేకర్స్‌కు టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 రోజుల పాటు జరగనున్న ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సిటీలోని ఒక్కో సర్కిల్ నుంచి రోజుకు వెయ్యి మందికి టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆయా సర్కిళ్లలో ఒక రోజు ముందుగా టోకెన్ల పంపిణీ చేపడుతున్నారు. టోకెన్‌పై టీకా వేసుకునేందుకు వెళ్లాల్సిన సెంటర్, టైమ్ స్లాట్ వివరాలు ఉంటాయి. దీని ద్వారా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫస్ట్ డే వ్యాక్సినేషన్‌కు సంబంధించిన టోకెన్లను వార్డుల వారీగా బల్దియా అధికారులు గురువారం పంపిణీ చేశారు.
సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా..
వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర వైరస్ వ్యాప్తి చెందే రిస్క్ లేకుండా బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. రిస్క్ టేకర్ల కోసం సిటీలో 30 సర్కిళ్లలో 32 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్‌లో 10 కౌంటర్ల సిద్ధం చేశారు. ప్రతి దానిలో 100 మంది చొప్పున ఒక్కో సెంటర్‌లో రోజుకు వెయ్యి మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తారు. టైమ్ స్లాట్ టోకెన్ల ఇవ్వడంతో పాటు ఎక్కువ కౌంటర్ల పెట్టడం ద్వారా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం ప్రతి సెంటర్ దగ్గర హెల్త్ స్టాఫ్‌కు సపోర్టింగ్‌గా 25 మంది చొప్పున బల్దియా సిబ్బందిని నియమించామని తెలిపారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ కేటగిరీలో వ్యాక్సిన్ ఎవరెవరికి?
పబ్లిక్ లైఫ్ సాఫీగా సాగడం కోసం కరోనా కష్ట సమయంలోనూ తమ సర్వీస్‌లు అందిస్తున్న ఎల్పీజీ డెలివరీ స్టాఫ్, పెట్రోల్‌బంకుల సిబ్బంది, రేషన్ డీలర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వెజిటేబుల్, ఫ్లవర్, ఫ్రూట్, ఫిష్ మార్కెట్వెండర్లు, వైన్స్షాప్స్, కిరాణ షాపులవాళ్లు, జర్నలిస్టులకు వైరస్ సోకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లంతా హైరిస్క్ గ్రూప్‌లో వ్యాక్సిన్ తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం వ్యాక్సిన్ వేయబోయే వారికి అధికారులు టోకెన్లు అందించారు.