ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రాంచందర్

ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రాంచందర్

మంచిర్యాల, వెలుగు: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. మంగళవారం గోదావరిఖనిలోని మిలీనియం హాల్​లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జాతీయ కమిషన్ సంచాలకుడు డాక్టర్ జి.సునీల్ బాబు, మంచిర్యాల, పెద్ద పల్లి జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, కోయ శ్రీహర్ష, మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు ఏ.భాస్కర్, పి.కరుణాకర్​తో కలిసి పాల్గొన్నారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చర్యలు చేపట్టి పరిహారం అందించాలన్నారు.

ఎఫ్ఐఆర్, కన్విక్షన్లకు సంబంధించి పోలీస్ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీల భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరారు. అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసు బాధితులకు 2022 వరకు పరిహారం అందించామని, తదుపరి బడ్జెట్ కోసం ఉన్నతాధికారులకు విన్నవించామని తెలిపారు.

ఎస్సీల అభివృద్ధికి చర్యలు తీసుకుటున్నామని,  కులాంతర వివాహాలు చేసుకున్న 14 జంటలకు 2024–25లో రూ.35 లక్షలు అందించామని వివరించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద జిల్లాలో 13 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఐదుగురిని సెలెక్ట్ చేసి ముగ్గురికి ఆర్థికసాయం అందించామన్నారు. జిల్లాలో అట్రాసిటీ కేసులకు సంబంధించి పోలీసు శాఖ పరిధిలో సమగ్రంగా విచారించి చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ భాస్కర్ తెలిపారు.