సుభాష్​రెడ్డి తిరుగుబాటు..కాంగ్రెస్​కు రాజీనామా

  •     పలు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు కూడా
  •     పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు
  •     రేబల్​గా బరిలో నిలుస్తానంటూ కన్నీటి పర్యంతం

కామారెడ్డి, ఎల్లారెడ్డి, వెలుగు : కాంగ్రెస్​ ప్రకటించిన సెకండ్​ లిస్ట్​తో ఎల్లారెడ్డిలో విభేదాలు భగ్గు మన్నాయి. పార్టీ మదన్​మోహన్​రావుకు టికెట్ ​కేటాయించడాన్ని నిరసిస్తూ టికెట్​ఆశించి భంగపడ్డ పీసీసీ జనరల్ సెక్రెటరీ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల లీడర్లు కూడా రాజీనామా చేస్తున్నారని వెల్లడించారు. పార్టీ పెద్దలను డబ్బులతో మేనేజ్​చేసి మదన్​మోహన్ ​టికెట్​ తెచ్చుకున్నారని ఆరోపించారు.

నమ్మకున్న రేవంత్​రెడ్డి కూడా తనకు అన్యాయం చేశారన్నారు. రెబల్​గా ఎన్నికల బరిలో నిలుస్తానని, మదన్​మోహన్​రావును  ఓడించడమే తన లక్ష్యమన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో తన అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనుచరుల మధ్య సుభాష్​రెడ్డి కన్నీటి పర్యంతం కాగా, కార్యకర్తలు ఆయన్ను ఓదార్చారు.

కాంగ్రెస్​ అభ్యర్థిని ఓడిస్తా..

అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత వడ్డేపల్లి సుభాష్​రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, గత ఎన్నికల్లో టికెట్​అడిగితే ఇవ్వలేదని అప్పుడు కూడా పార్టీ గెలుపునకే పని చేశానన్నారు. జహీరాబాద్​ఎంపీ అభ్యర్థిగా ఉన్న మదన్​మోహన్​కు మద్దతుగా ప్రచారం చేశానన్నారు. పీసీసీ ప్రెసిడెంట్​తో సహా చాలా మందిని డబ్బులతో మేనేజ్​ చేశానని మదన్​మోహన్​రావు చెప్పుకుంటున్నారని సుభాష్​రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​లాబీయిస్ట్​ పార్టీగా మారిందన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల కష్టాసుఖాల్లో తోడుగా నిలిచానని, పార్టీకి సంబంధించిన అనేక మీటింగ్​లను సక్సెస్ ​చేశానన్నారు.

ప్రాణమున్నంత వరకు మదన్​మోహన్​రావును ఎమ్మెల్యేగా గెలవనీయ్యనని శపథం చేశారు. ఆయనకు ఓటేసి గెలిపిస్తే మళ్లీ బీఆర్ఎస్​లో  చేరుతారని, ఇదే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తానన్నారు. రెబల్​గా ఎన్నికల బరిలో నిలుస్తానన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల సేవలో ఉంటానన్నారు. కార్యకర్తలతో చర్చించి రెండు రోజుల్లో తుది నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. కార్యకర్తలే తన అధిష్టానవర్గమని పేర్కొన్నారు. 

ఫేక్​ సర్వేలు చేసిండ్రు

మదన్​మోహన్ ​కోసం సర్వేల ఫలితాలను మార్చారని, అన్ని ఫేక్​ సర్వేలేనని సుభాష్​రెడ్డి కొడుకు దినేశ్​రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గానికి చెందిన పలువురి అభిప్రాయాలు తీసుకున్నట్లు సర్వే పత్రాలు ఉన్నాయని, ఇవన్నీ తప్పని తాను పీసీసీ ముఖ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు.