వడ్డెరులకు రాజకీయ గుర్తింపు పెరగాలి : చైర్మన్​ జెరిపేట జైపాల్ 

  • వడ్డె ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్​
  •  వడ్డెర కార్పొరేషన్ చైర్మన్​ జెరిపేట జైపాల్ 

రామచంద్రాపురం, వెలుగు: ఎన్నో తరాలుగా అణచబడుతున్న వడ్డెర కులస్తులకు ఇకనైనా రాజకీయ గుర్తింపు పెరగాలని తెలంగాణ వడ్డెర కార్పొరేషన్​ చైర్మన్ జెరిపేట జైపాల్ అన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుడు, వడ్డెరుల ఆరాధ్య దైవం వడ్డె ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని కొనియాడారు. శనివారం వడ్డెర సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వరికుప్పల లింగయ్య ఆధర్యంలో రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన ఓబన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ వడ్డెరులంతా ఐకమత్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​ ప్రభుత్వంలో వడ్డెర కులస్తులకు సముచిత రాజకీయ స్థానాలు దక్కుతాయని, చరిత్రలో గుర్తిండిపోయే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓబన్న జయంతిని అధికారికంగా జరపడం వడ్డెర కులస్తులకు పండుగ లాంటిదన్నారు. మహనీయుల త్యాగాలను గుర్తిస్తే చరిత్రలో మిగిలిపోతారని, ఇదే స్ఫూర్తితో కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వడ్డెర కులస్తుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా వడ్డెరులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుల సంఘం నాయకులు శ్రీరాములు, సాయికుమార్​, నర్సింహులు, అంజయ్య, ముత్యాలు, ఎట్టయ్య, సిద్దయ్య, పెద్దులు పాల్గొన్నారు.