‘వాహన్​ సారథి’ లేట్!..జనవరి నుంచి అమలు అనుకున్న ఆర్టీఏ ఆఫీసర్లు

‘వాహన్​ సారథి’ లేట్!..జనవరి నుంచి అమలు అనుకున్న ఆర్టీఏ ఆఫీసర్లు
  • టెక్నికల్ ఇష్యూస్ తో  మరో నెల లేటయ్యే చాన్స్  
  • సికింద్రాబాద్​లో పైలట్ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణ ఆర్టీఏ డేటాను కేంద్ర ప్రభుత్వ పోర్టల్ వాహన సారథిలోకి అనుసంధానం చేసి.. ఆర్టీఏ సేవలను దేశంలోని ఎక్కడి నుంచైనా ఉపయోగించుకోవాలనుకోగా ఇది మరో నెల ఆలస్యమయ్యేలా ఉంది. జనవరి నుంచి వాహన సారథి పోర్టల్​అమల్లోకి వస్తుందని అనుకున్నా టెక్నికల్​ఇష్యూస్ తో ఫిబ్రవరిలో తీసుకొస్తామంటున్నారు ఆర్టీఏ అధికారులు. ఇంతకుముందు గత అక్టోబర్​లో అమలు చేయాలని అనుకోగా, ఇలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో వాయిదా పడింది.  

ఏంటీ వాహన సారథి? 

కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ ‘వాహన సారథి’ ఆన్​లైన్​పోర్టల్​ను రూపొందించింది.  ఇంట్లో కూర్చొనే లెర్నింగ్​లైసెన్స్ నుంచి రిజిస్ట్రేషన్​వరకు మొత్తం18 రకాల సేవలను ఆన్​లైన్​ద్వారా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్​ప్రక్రియను కూడా డీలర్లే పూర్తి చేస్తారు. ఇందులో భాగంగా పరివాహన్​సేవా పేరిట ప్రత్యేక ఆన్​లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసిన కేంద్రం.

దీని పరిధిలోకి వాహన సారథి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మన రాష్ట్రం మినహా దేశంలోని అన్నిరాష్ట్రాలు పోర్టల్​తో అనుసంధానమై సేవలను అందుబాటులోకి తెచ్చాయి. గతేడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది.  దీంతో సికింద్రాబాద్​ఆర్టీఏ ఆఫీసు నుంచి పైలట్​ప్రాజెక్టుగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆ తర్వాత  రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ జోన్లలో ఇంప్లిమెంట్​చేయాలని డిసైడ్​అయింది. 

 ఏం జరిగింది? 

వాహన్​సారథి అమలుకు తెలంగాణ ఆర్టీఏ డేటాను జాతీయ రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పోర్టల్​కు బదిలీచేసే క్రమంలోనే టెక్నికల్​ఇష్యూస్​వస్తున్నాయి. మొదట 2024 అక్టోబర్​లోనే మొదలుపెట్టాలని అనుకున్నా సాధ్యం కాలేదు. మళ్లీ జనవరి 2025 అని వాయిదా వేయగా, అదే టెక్నికల్​ఇష్యూస్​తో ఆలస్యమవుతుంది.  మన రాష్ట్రంలో ఆర్టీఏకు సీఎంఎస్​సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ఈ సంస్థ నుంచి నేషనల్ ​ఇన్ఫర్మేషన్ ​సెంటర్(ఎన్ఐఎస్​)కు సమాచార బదిలీలో ప్రాథమిక దశలోనే ఇబ్బందులు వస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డ్రైవింగ్​ లైసెన్స్​ డేటా సీఎంఎస్​లో లేకపోవడం కూడా సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆర్టీఏ లైసెన్సులు మ్యానువల్​గా జారీ అయ్యేవి. ఆ తర్వాత సీఎంఎస్​ సాంకేతిక పరిజ్ఞనంతో రూపొందించిన డ్రైవింగ్​ లైసెన్స్​ఇస్తోంది. ఈ డేటా టు టైర్, త్రీ టైర్​ టెక్నాలజీతో ఉండడంతో ఎన్ఐసీకి బదిలీ చేయడంలో టెక్నికల్​ఇష్యూస్​ వస్తున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కరించి అందుబాటులోకి తెస్తామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 

18 రకాల సేవలివే.. 

వాహన్​సారథితో వాహనదారులు ఇంటి నుంచే సేవలను పొందొచ్చు. లెర్నింగ్​లైసెన్స్​కావాలంటే ఆన్ లైన్​లో  ఎక్కడి నుంచైనా పరీక్ష రాసి లైసెన్స్​తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​కు  ఇప్పటివరకు ఆన్​లైన్​లో స్లాట్​బుక్​చేసుకుని  ఇచ్చిన టైంకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సి ఉండేది. వాహన సారథి వస్తే షోరూమ్ ల్లో డీలరే ఆ పని కంప్లీట్  చేయొచ్చు.  వీటితో పాటు డ్రైవింగ్​లైసెన్స్​రెన్యూవల్, ఫీజుల చెల్లింపులు, వాహనాలను ఇతరులకు అమ్మిన సమయంలో బదిలీ వంటి దాదాపు 18 రకాల సేవలు ఆన్​లైన్​ద్వారా దేశంలోని ఎక్కడి నుంచైనా నిర్వహించుకునే చాన్స్ ఉంది.