RR vs GT: వైభవ్ ఊర మాస్ ఇన్నింగ్స్.. 35 బంతుల్లో సెంచరీతో శివాలెత్తిన 14 ఏళ్ళ కుర్రాడు

RR vs GT: వైభవ్ ఊర మాస్ ఇన్నింగ్స్.. 35 బంతుల్లో సెంచరీతో శివాలెత్తిన 14 ఏళ్ళ కుర్రాడు

ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీరు ఉతుకుడు ఉతుకుతున్నాడు. జైపూర్ లో సోమవారం (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో బెస్ట్ బౌలింగ్ లైనప్ గా పేరున్న గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం తన మూడో మ్యాచ్ లోనే 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని సంచలనం సృష్టించాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లున్నాయి.  

ఆరంభం నుంచి సూర్యవంశీ గుజరాత్ బౌలర్లను వదల్లేదు. సిరాజ్ బౌలింగ్ లో సిక్సర్ ను కొట్టి దూకుడు ప్రదర్శించిన వైభవ్.. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించాడు. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టి ఔరా అనిపించాడు.ఇక కరీం జనతా వేసిన 10 ఓవర్లో ఏకంగా 30 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. రషీద్ ఖాన్ వేసిన 11 ఓవర్ రెండో బంతికి సిక్సర్ తో 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. భారత్ తరపున ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. 

వైభవ్ తో పాటు జైశ్వాల్ బ్యాట్ ఝులిపించడంతో పాటు రాజస్థాన్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం 11 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 155 పరుగులు చేసింది. క్రీజ్ లో సూర్యవంశీ (101), జైశ్వాల్ (49) ఉన్నారు.