
- 14 ఏండ్ల వైభవ్‌పై ప్రశంసల వర్షం
- రూ. 10 లక్షల రివార్డు ప్రకటించిన బీహార్ సీఎం
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : ఐపీఎల్‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన 14 ఏండ్ల యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దేశం మొత్తం తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున మెగా లీగ్‌లో ఎంట్రీ ఇచ్చి తన మూడో మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న ఈ బీహార్ బుడ్డోడు ఇప్పుడు ఇండియా క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా మారాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బాల్స్‌లోనే వంద కొట్టి ఔరా అనిపించిన సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నుంచి బీహార్ సీఎం నితీశ్ కుమార్ వరకూ అందరూ అతని ఆటను మెచ్చుకుంటున్నారు.
తను త్వరలోనే టీమిండియాలోకి రావడం ఖాయమని మరికొందరు జోస్యం చెబుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ కొట్టిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన సూర్యవంశీకి స్వయంగా ఫోన్ చేసి అభినందించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ తమ ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల రివార్డు ప్రకటించారు. ఫ్యూచర్‌లో ఇండియా టీమ్ తరఫున కూడా మరెన్నో రికార్డులు సృష్టించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
చెప్పి మరీ కొట్టేశాడు..
వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌ను ఎవ్వరూ ఊహించలేదు. కానీ, గుజరాత్‌పై తన బ్యాట్‌తో గర్జించాలని ఆ కుర్రాడు ముందే డిసైడయ్యాడు. మంగళవారం ఉదయం తన చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝాకు ఫోన్ చేసిన సూర్యవంశీ ‘సర్, ఈ రోజు నేను దంచికొడతా’ అని చెప్పాడు. ‘సరే కొట్టు కానీ.. వికెట్ పారేసుకోకు. ప్రశాంతంగా ఆడుతూ యశస్వి జైస్వాల్‌తో మాట్లాడుతూ ఉండు’ అని మనీష్ సూచించాడు. కోచ్‌కు చెప్పినట్టుగానే అతను గుజరాత్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు.
తన వయసుకు రెండింతల అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ, ప్రస్తుత తరంలో మేటి బౌలర్లు అయిన సిరాజ్, రషీద్ ఖాన్ వంటి సీనియర్లను సైతం లెక్కచేయకుండా వైభవ్ సాగించిన విధ్వంసం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. కోచ్ చెప్పినట్టుగానే వికెట్ పారేసుకోకుండా కూల్‌గా ఆడుతూ సెంచరీ కొట్టాడు. అతని ఆటకు ఫిదా అయిన రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన గాయాన్ని సైతం లెక్కచేయకుండా వీల్‌చైర్ నుంచి లేచి నిలబడి కేరింతలు కొట్టిన సీన్‌ను అంత త్వరగా మర్చిపోలేం.
ఇది ఆరంభమే..
రికార్డు సెంచరీతో వెలుగులోకి వచ్చిన వైభవ్‌కు ఇప్పటి నుంచే అసలైన సవాల్ ఎదురవనుంది. కలలో కూడా ఊహించని స్టార్‌డమ్ అప్రయత్నంగానే అతనిపై అదనపు భారం కానుంది. టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి హెచ్చరించినట్లుగా బౌలర్లు ఇకపై అతనిపై షార్ట్ పిచ్ బాల్స్‌తో ఎటాక్ చేయనున్నారు. వీటిని ఎదుర్కొని నిలబడితేనే తన సెంచరీ గాలివాటం కాదని వైభవ్ నిరూపించుకుంటాడు. పైగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఈ కుర్రాడు ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఓపెనింగ్‌కు వచ్చాడు. తనకు అలవాటైన నిర్భయమైన ఆటతో బాల్‌ను బాదేశాడు. సెహ్వాగ్ స్టయిల్‌లో కొట్టాల్సిన బాల్ వస్తే కొట్టాల్సిందే అన్నట్టుగా ఉంది అతని ఆట. కానీ, మున్ముందు అతను ఆట ఆరంభం నుంచే తుది జట్టులో ఉండి గ్రౌండ్‌లోకి వస్తే అత్యున్నత స్థాయి మ్యాచ్‌ల్లోని అసలు ఒత్తిడిని తెలుసుకుంటాడు.
ఈ ఇన్నింగ్స్ తర్వాత అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో అండర్19 క్యాంప్‌లో ఓ స్టార్‌గా చేరడం ఖాయం. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ టీమ్‌లో ఉన్నాడు కాబట్టి మరో నెల రోజుల పాటు రాహుల్ ద్రవిడ్ గైడెన్స్ తనపై ఉంటుంది. కానీ, సీఓఈలో అతనికి రాహుల్ మాదిరి మార్గనిర్దేశం లభిస్తుందా? అక్కడి కోచ్‌లు వైభవ్‌ను తనదైన శైలిలో ఆడేలా ప్రోత్సహిస్తారా? ఒకవేళ వాళ్లు ఏమైనా మార్పులు చేస్తే దానికి తను అలవాటు పడతాడా? అన్నది కీలకం కానుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా సూర్యవంశీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. భారీ స్టార్‌డమ్‌తో పాటు కోట్ల రూపాయల ఆఫర్లతో స్పాన్సర్లు అతని వెంట పడనున్నారు.
దీంతో వైభవ్ ఫ్యామిలీ ఆర్థిక కష్టాలు అన్నీ తీరుతాయి. కానీ, డబ్బు, స్టార్‌డమ్, లగ్జరీ సౌకర్యాలు, ఇతర ఆకర్షణలు ఒక్కోసారి ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా సూర్యవంశీ కెరీర్‌లో ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రెండు, మూడేండ్లు అతని కెరీర్‌లో అత్యంత కీలకం కానున్నాయి. ఈ సమయంలో ఎదురయ్యే సవాళ్లను, ఆకర్షణలను దాటుకొని, ఆటపైనే ఫోకస్ పెడితే ఈ యంగ్ సెన్సేషన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టార్ అవ్వగలడు.
త్యాగాల పునాదిపై..
సెంచరీతో ఓవర్‌నైట్ స్టార్ అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఎంతో కష్టపడుతూ.. త్యాగాల పునాదిపై ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన వైభవ్ నాలుగేండ్ల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఒకప్పుడు క్లబ్ లెవెల్ క్రికెటర్ అయిన సంజీవ్ తన కొడుకులో టాలెంట్‌ను గుర్తించాడు. తనను తీర్చిదిద్దేందుకు తమకు అన్నం పెట్టే వ్యవసాయ భూమి మొత్తాన్ని అమ్మి మంచి కోచింగ్ ఇప్పించాడు.
తన పని వదిలేసి అనుక్షణం వెన్నంటే నిలిచాడు. దాంతో కుటుంబ బాధ్యతలను వైభవ్ అన్న చూసుకోవాల్సి వచ్చింది. తల్లి ఆర్తి రోజుకు కేవలం 3–4 గంటలు మాత్రమే నిద్రపోయి మిగిలిన సమయాన్ని మొత్తం వైభవ్ కోసం కేటాయించేది. వాళ్ల త్యాగాలే సూర్యవంశీకి ప్రేరణగా నిలిచాయి. ఏదైనా సాధించాలంటే ముందుగా తనకు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి ఉంటుందని వైభవ్ చిన్నవయసులోనే గుర్తించాడు. కోచ్ మనీష్ ఓజా సూచన మేరకు తనకు ఇష్టమైన పిజ్జా, మటన్‌ను త్యాగం చేసి క్రికెట్‌పై పూర్తిగా దృష్టి సారించాడు. పేరెంట్స్ ప్రోత్సాహం, మనీష్ కోచింగ్‌తో తక్కువ కాలంలోనే రాటు దేలిన సూర్యవంశీ బీహార్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల్లో పడ్డ తర్వాత ఈ బీహార్ బుడ్డోడు ఇప్పుడు కోహినూర్ వజ్రంలా తయారయ్యాడు.
ఫస్ట్ బాల్‌కు సిక్స్‌లు నాకు కొత్తేం కాదు
ఐపీఎల్‌లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న వైభవ్ ఎదుర్కొన్న మొదటి బాల్‌కే సిక్స్ కొట్టడం తనకు ముందు నుంచి అలవాటే అంటున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై రికార్డు సెంచరీ తర్వాత ఐపీఎల్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు. ‘ఇది నాకు సాధారణ విషయమే. నేను ఇండియా అండర్-19 లెవల్‌లో ఆడాను. డొమెస్టిక్ లెవెల్‌లో కూడా కూడా ఫస్ట్ బాల్ సిక్సులు కొట్టాను. తొలి పది బాల్స్‌ను ఎదుర్కొనేటప్పుడు నేను అస్సలు ఒత్తిడిగా భావించను. నా రాడార్‌లోకి బాల్ వస్తే దాన్ని దంచికొట్టాల్సిందేనని నా మైండ్‌లో పూర్తి క్లారిటీ ఉంటుంది’ అని సూర్యవంశీ చెప్పాడు. ఇక, తన తల్లిదండ్రులు చేసిన త్యాగం వల్లే తానిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు.
‘మా అమ్మానాన్నల వల్లే నేను ఇక్కడ ఉన్నా. మా అమ్మ నా ప్రాక్టీస్ కోసం రాత్రి 11 గంటలకు నిద్రపోయి తెల్లవారుజామున 3 గంటలకు లేచి నాకు ఆహారం సిద్ధం చేస్తుంది. మా నాన్న తన పని వదిలి నా వెన్నంటే నిలిచారు. మా అన్నయ్య పని చేస్తూ ఇల్లు చూసుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా మా నాన్న నా వెనక బలంగా నిలబడ్డారు. దేవుడు కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ నిరాశపరచడు. నేడు నా జీవితంలో కనిపిస్తున్న విజయాలన్నీ నా తల్లిదండ్రుల నిస్వార్థమైన ప్రేమ, త్యాగానికి వచ్చిన దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నా’ అని పేర్కొన్నాడు.
టీమిండియానే టార్గెట్
క్రికెట్‌లో తాను మరో స్థాయికి చేరాలన్న లక్ష్యంతో కష్టపడి ముందుకెళ్లాలని సూర్యవంశీ నిర్ణయించుకున్నాడు. ‘నేను టీమిండియాకు ఆడాలని అనుకుంటున్నాను. ఆ స్థాయికి చేరే వరకు నేను కష్టపడుతూనే ఉంటా. నేషనల్ టీమ్ తరఫున ఆడి సత్తా చాటాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పాడు. ఐపీఎల్‌లో తనకు చాన్స్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్‌కు వైభవ్ థ్యాంక్స్ చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ దగ్గర శిక్షణ పొందడంతో ఒక కల నిజమైనట్టు అనిపిస్తోందని తెలిపాడు.
వైభవ్ ధైర్యంగా ఆడిన విధానం, బ్యాట్ స్పీడ్, లెంగ్త్‌ని వెంటనే గుర్తించి బలంగా బాల్‌ను హిట్ చేయడం అన్నీ అద్భుతం. 38 బాల్స్‌లో101 రన్స్ ఓ అసాధారణ ఇన్నింగ్స్! అద్భుతంగా ఆడావు వైభవ్.
సచిన్ టెండూల్కర్
మీరు 14 ఏండ్లప్పుడు ఏం చేశారో గుర్తుందా? ఈ బుడ్డోడు మాత్రం కనీసం రెప్పవాల్చకుండా వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటున్నాడు! వైభవ్ సూర్యవంశీ– ఈ పేరు గుర్తుంచుకోండి. నిర్భయంగా ఆడుతున్నాడు. భావి తరం ఇలా ప్రకాశించడం చూసి నేను ఎంతగానో గర్వపడుతున్నా.
యువరాజ్ సింగ్