IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు.. ఎవరతను..? ఏంటి స్పెషాలిటీ..?

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు.. ఎవరతను..? ఏంటి స్పెషాలిటీ..?

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈనెల 24, 25(ఆది, సోమవారం) తేదీల్లో సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా మెగా వేలం  జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం(నవంబర్ 15) వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను ప్రకటించింది. మొత్తం 1574 మంది ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోగా.. వడపోతల అనంతరం 574 మంది షార్ట్ లిస్ట్ చేశారు.

షార్ట్ లిస్ట్ చేయబడిన ఈ 574 మందిలో 366 మంది భారత ఆటగాళ్లు కాగా.. 208 మంది ఓవర్సీస్(విదేశీ) ప్లేయర్లు, మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందినవారు. ఈ జాబితాలో అత్యంత ఎక్కువ వయస్కుడిగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిలవగా.. అత్యంత పిన్నవయస్కుడిగా బీహార్ కుర్రాడు 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇదే క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. 1574 మందిలో వెయ్యి మందిని తొలగించిన ప్రాంఛైజీలు.. ఓ 13 ఏళ్ల కుర్రాడికి చోటివ్వడమేంటని మాట్లాడుకుంటున్నారు. అతని స్పెషాలిటీ ఏంటన్న చర్చ జరుగుతోంది. 

కుమారుడి కోసం అట స్థలం

సూర్యవంశీ స్వస్థలం.. బీహార్‌లోని తాజ్‌పూర్ గ్రామం. ఇది సమస్తిపూర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. తండ్రి పేరు.. సంజీవ్ సూర్యవంశీ. 2011, మార్చి 27న జన్మించిన  ఈ బుడతడు.. నాలుగేళ్ళ వయస్సులో మొదటిసారి బ్యాట్ పట్టాడు. క్రికెట్ పట్ల అతని మక్కువను చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్.. కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని నిర్మించారు. అక్కడే అతనికి రోజంతా గడిచిపోయేది. ఇరుగుపొరుగు వారితో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. వైభవ్‌కు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తండ్రి  అతన్ని సమస్తిపూర్‌లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ రెండున్నరేళ్ల శిక్షణ అనంతరం పదేళ్ల ప్రాయానికి అండర్- 16 క్రికెట్‌లోకి ప్రవేశించాడు.

పదేళ్ల వయస్సులోనే వైభవ్.. బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ ఔరా అనిపించాడు. హేమన్ ట్రోఫీ, అంతర్-జిల్లా టోర్నమెంట్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లలో దాదాపు 800 పరుగులు చేశాడు. అదే ఫామ్‌ను వినూ మన్కడ్ ట్రోఫీలోన్యూ కొనసాగించాడు. 5 మ్యాచ్‌ల్లో 400కు పైగా పరుగులు చేశాడు. ఇక్కడే అతని దిశ తిరిగింది. బీహార్ బోర్డు దృష్టిలో పడ్డాడు.

ఈ ఏడాదే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం

ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ రాష్ట్రం తరుపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతని వయస్సు.. 12 ఏళ్ల 284 రోజులు. అనంతరం భారత అండర్19 టీమ్‌కి ఎంపికైన ఈ బుడతడు.. ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి అతి పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లోనూ ఆడుతున్నాడు. ఇది అతని కెరీర్ ప్రారంభ దశ అయినప్పటికీ, వేలంలో అమ్ముడుపోయి రికార్డులు క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

జియో సినిమాలో లైవ్

రెండు రోజుల పాటు జరిగే మెగా వేలం నవంబర్ 24(ఆదివారం) మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియో సినిమా మెగా వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.