నల్లనయ్యగా రామయ్య

నల్లనయ్యగా రామయ్య

భద్రాచలం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచల రామచంద్రస్వామి బుధవారం శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు. ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం స్వామిని ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశాక, కృష్ణావతారంలో అలంకరించి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ఆరాధన అనంతరం స్వామివారిని బంగారు ఊయలలో కూర్చోబెట్టారు.

చతుర్వేద విన్నపాలు, నాళాయర దివ్యప్రబంధ పారాయణం జరిగాయి. వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల రామనామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామివారిని పల్లకీలో మిథిలాస్టేడియానికి తీసుకెళ్లి భక్తులకు దర్శనం కల్పించారు. తిరువీధి సేవలో భాగంగా చిన్నారులు గోపికలు, కృష్ణుని వేషధారణలో స్వామికి స్వాగతం పలుకుతూ గోవిందరాజస్వామి ఆలయం వరకు తీసుకెళ్లారు. దారిపొడవునా భక్తులు స్వామి వారికి మంగళనీరాజనాలు పలుకుతూ మొక్కులు చెల్లించుకున్నారు.