- భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు, ప్రముఖులు
యాదగిరిగుట్ట/భద్రాచలం/కొండగట్టు, వెలుగు : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి, కొండగట్టులో అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇచ్చారు. యాదగిరిగుట్టలో ఉదయం 5.28 గంటలకు యాదగిరీశుడిని లక్ష్మీనరసింహస్వామి అలంకారంలో గరుడ వాహనంపై ఉత్తర రాజగోపుర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు.
ఉదయం 7.30 గంటల వరకు ఉత్తర ద్వారదర్శనం కల్పించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. స్థానిక భక్తులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న అనంతరం గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ భాస్కర్ ఫ్యామిలీలతో స్వామివారిని దర్శించుకున్నారు.
పెద్దపల్లి, ధర్మపురిలో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
పెద్దపల్లి/జగిత్యాల, వెలుగు : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనర్సింహస్వామిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. పెద్దపల్లిలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ధర్మపురిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లిలో ఆలయ కమిటీ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్, నాయకులు సయ్యద్ సజ్జాద్, బండారి సునీల్ ఉన్నారు.
భద్రాచలం, కొండగట్టులో...
భద్రాచలంలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం ఐదు గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఆ తర్వాత సుమారు గంటపాటు స్వామివారికి ప్రత్యేక, అష్టోత్తర పూజలు నిర్వహించి వేదాలను పఠించారు. అనంతరం గరుడ వాహనంపై శ్రీరాముడు, గజవాహనంపై సీతమ్మవారిని అధిష్ఠింపజేసి తిరువీధి సేవ నిర్వహించారు. అంతకుముందు అర్ధరాత్రి 12 గంటలకు గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు భక్తరామదాసు పేరిట స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ మొదటి తొలి అభిషేకం నిర్వహించారు.
భద్రాద్రిలో శనివారం నుంచి నిత్యకల్యాణాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలోనూ ఉత్తర ద్వారదర్శనం, తిరువీధి సేవలు జరిగాయి. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఈవో రమాదేవి పాల్గొన్నారు.
అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం చేసి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి అలివేలు మంగతాయారు పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి తీసుకువచ్చి అభిషేకం జరిపించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు.