భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుక వైభవంగా జరిగింది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉత్తరద్వారం ద్వారా వైకుంఠ రామయ్యను తిలకించేందుకు చేరుకున్నారు.
వేదమంత్రోచ్ఛరణలు, గుగ్గిలం పొగలు, రామనామ సంకీర్తనల మధ్య ఉత్తరద్వారం తెరుచుకోగానే గరుడ వాహనంపై రామయ్య, గజవాహనంపై సీతమ్మవారు, ఆంజనేయస్వామి వాహనంపై లక్ష్మణస్వామి దర్శనం ఇచ్చారు. దర్శనం అనంతరం ఉత్తరద్వారం గుండా గర్భగుడికి చేరుకుని మూలవరులను పూజించారు.
కలెక్టర్, ఐటీడీఏ పీవోలు సైతం సాధారణ భక్తుల వలే ఉత్తరద్వారం క్యూలైన్లో వెళ్లారు. తిరువీధి సేవ అనంతరం సాయంత్రం ఏఎస్పీ ఆఫీసులో రాపత్సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా వైకుంఠ రామయ్యకు విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిగాయి.
తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గోదావరి తీరంలో ఏరు ఫెస్టివల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన రామాయణ ఘట్టాలు, ఆదివాసీ నృత్య కళారూపాలు ఆలోచింపజేశాయి. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. - భద్రాచలం/ నెట్వర్క్, వెలుగు