భద్రాద్రిలో 31 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాద్రిలో 31 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

హైదరాబాద్, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 31 నుంచి జనవరి 20 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాలకు హాజరుకావాలంటూ మంత్రి  కొండా సురేఖను భద్రాచలం ఆలయ ఆఫీసర్లు ఆహ్వానించారు. హైదరాబాద్‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌లోని మినిస్టర్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో మంత్రిని సోమవారం భద్రాచలం ఈవో రమాదేవి, అర్చకులు కలిశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

అనంతరం ఎండోమెంట్‌‌‌‌ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌‌‌, కమిషనర్‌‌‌‌ శ్రీధర్‌‌, అడిషనల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ జ్యోతితో కలిసి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్‌‌‌‌ను మంత్రి ఆవిష్కరించారు. 31 నుంచి స్వామివారికి దశావతార అలంకార సేవలు, జనవరి 9న తెప్పోత్సవం,  జనవరి 10న ఉత్తర ద్వారదర్శనం నిర్వహిస్తనున్నట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ ఈవోను ఆదేశించారు. అలాగే భద్రాచల అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.