బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లితోపాటు ఆధిపత్య పోరు రోజురోజుకు కాక పుట్టిస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు.. ఇప్పుడు కట్టలు తెచ్చుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహార శైలిపై.. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ బహిరంగంగా చేసిన విమర్శలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ.. మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని.. ఆయనకు తన నియోజకవర్గంలో ఏం పని అంటూ నిలదీశారు ఎమ్మెల్యే రాములు నాయక్.
ALSO READ :అయ్యా కేసీఆర్ సారూ... మా గోడు వినపడటం లేదా..
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో మంత్రి అజయ్ జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాములు నాయక్. ఎమ్మెల్యేగా తన విధులను ఆటంకం పరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. మంత్రి తన నియోజకవర్గంలో వేలు పెడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్.. రాజు, యువరాజు అయితే.. సామంత రాజు మాత్రం తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పువ్వాడ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పువ్వాడ.. ఖమ్మం జిల్లా మొత్తానికి ఎమ్మెల్యేనా లేదా ఖమ్మం నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు. మంత్రిగా మళ్లీ ఒక్కడే గెలిచి.. మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించాలని పువ్వాడ చూస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ కు తెలియకుండా.. సామంత రాజుల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.