
- రెండు సార్లు అసెంబ్లీ,మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సునీత
మెదక్, నర్సాపూర్, వెలుగు: వరుసగా మూడు సార్ల ఓటమి తర్వాత నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వాకిటి సునీతారెడ్డి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి గా పనిచేసిన సునీతారెడ్డి.. తర్వాత వరుసగా మూడు సార్లు ఓటమి పాలయ్యారు. రెండు సార్లు అసెంబ్లీ, ఒకసారి పార్లమెంట్ఎన్నికల్లో పరాజయం చూశారు.
అనూహ్యంగా రాజకీయాల్లోకి..
1999 సాధారణ ఎన్నికల సమయంలో నర్సాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ టికెట్‌ఆశించిన శివ్వంపేట మండల జడ్పీటీసీ లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ నర్సాపూర్ టికెట్‌ను లక్ష్మారెడ్డి భార్య సునీతారెడ్డికి కేటాయించింది. అప్పటి వరకు గృహిణిగా ఉన్న సునీతారెడ్డి అనూహ్యంగా రాజకీయరంగ ప్రవేశం చేశారు.
1999 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అమె తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు మరోమారు కాంగ్రెస్ టికెట్ లభించగా ఆ ఎన్నికల్లోనూ గెలుపొంది వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో మీడియం ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సునీతారెడ్డి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అపుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సునీతారెడ్డికి మంత్రి పదవి దక్కింది.
రెండు అసెంబ్లీ.. ఒక పార్లమెంట్ఎన్నికల్లో
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సునీతారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవి చేపట్టాలని నిర్ణయించుకుని ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
దీంతో మెదక్ లోక్‌సభ స్థానానికి బై ఎలక్షన్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో సునీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నర్సాపూర్ స్థానంలో పోటీ చేయగా ఆ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఇలా సునీతారెడ్డి ఐదేళ్లలో వరుసగా మూడుసార్లు ఓటమి చవిచూసింది.
2019లో పార్టీ మారి..
గతంలో మూడు సార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలో తనకు తిరుగులేదని చాటిన సునీతారెడ్డి.. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. 2021లో ఆమెకు రాష్ట్ర మహిళా కమిషన్చైర్ పర్సన్ పదవి దక్కింది.
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థిగా నర్సాపూర్అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సునీతారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదివరకు వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి ఆవులు రాజిరెడ్డిపై గెలుపొందారు.