
- బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే అమలు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ బిల్లును గవర్నర్ ఆమోదం పొందేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలతో చురుకుగా పనిచేయాలన్నారు. బీసీల హక్కులను మరింత కాలం అణచివేయలేరని, హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా వదిలేయడం బాధ్యతారహిత్య రాజకీయ విధానంగా మారుతుందన్నారు.