వచ్చేసిందమ్మా.. వచ్చేసింది.. ప్రేమికుల అతి పెద్ద పండగ.. ‘వాలెంటైన్స్ డే(Valentine’s Day)’. ఇక ఆగేది లేదు. ప్రపోజ్ చేయాలనుకున్న వాళ్లు చేసేయొచ్చు. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్లు.. తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించొచ్చు.
నిజానికి ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల రోజుగా చెప్పుకుంటున్నప్పటికీ, ‘వాలెంటైన్స్ వీక్’ పేరిట వారం రోజులు ముందుగానే ప్రేమ పక్షుల సందడి మొదలవుతుంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే.. రూపంలో రాబోవు ఏడు రోజులు లవర్స్ ముచ్చట్లు ఉంటాయి. రోజుకో బహుమతితో.. మనసిచ్చిన వారిని ఆశ్చర్యపరచడమే.. ఈ వాలెంటైన్స్ వీక్ స్పెషాలిటీ.
ALSO READ | Valentine's Day: ప్రేమికుల రోజున.. అమ్మాయిలే అబ్బాయిలకు బహుమతులు ఇస్తారు.. ఎక్కడో తెలుసా..!
శుక్రవారం(ఫిబ్రవరి 07).. రోజ్ డే. అంటే, ఆరోజు ప్రియురాలికి లేదా ప్రియుడికి గులాబీ ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరచడం. అలా అని ఏ రంగు పడితే ఆ రంగు గులాబీ ఇచ్చారంటే.. మీరు కష్టాలు కొనితెచ్చుకున్నట్టే. మీది ప్రేమో.. స్నేహమో.. అమాయకత్వమే తెలియక అవతలి వారు జుట్టు పీక్కుంటారు. ఎందుకంటే, ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎర్ర గులాబీ.. నిజమైన ప్రేమకు చిహ్నం
ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. ఎదుటి వారి మీద మీకున్న ఇష్టాన్ని సూచిస్తుంది. కావున.. ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారు ఎర్ర గులాబీ ఇవ్వండి. అంతేకాదు, ఇది రొమాంటిక్ హావభావాలకు ఒక క్లాసిక్ ఎంపిక. మీలో దాగున్న లోతైన ప్రేమను, అభిరుచిని మీరు ఇష్టపడే వారికి తెలియజేస్తాయి.
పింక్ రోజ్.. ప్రశంస, కృతజ్ఞత
వీటిని రాణి రంగు గులాబీ అని కూడా అంటుంటారు. పింక్ గులాబీలు.. ప్రశంసలు, కృతజ్ఞతను సూచిస్తాయి. అంటే, ఎవరినైనా అభినందించటానికి లేదా థాంక్స్ చెప్పటానికి వీటిని ఎక్కువగా ఇస్తుంటారు. మీకు బాగా ఇష్టమైన వారి పట్ల మీకున్న గ్రాటిట్యూడ్, వారిపై మీకున్న ఆప్యాయతని తెలియపరచటానికి ఇవి పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి.
పసుపు గులాబీ.. స్నేహం
పసుపు గులాబీ.. స్నేహానికి చిహ్నం. ఈ రంగు గులాబీలను ఎక్కువగా స్నేహితులు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పసుపు రంగు స్నేహితుల మధ్య ఉన్న బంధాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది. స్నేహానికి ఇవి ప్రతీక కనుక.. ప్రేమించే వారికి ఎల్లో రోజ్ ఇవ్వడం సరైనది కాదు. స్నేహం ముసుగులో ప్రేమన్న అపార్థాలు దారితీస్తాయి.
తెల్ల గులాబీ.. స్వచ్ఛత, అమాయకత్వం
రంగుకు తగ్గట్టే.. తెలుపు గులాబీ స్వచ్ఛతకి మారుపేరు. కొత్త బంధాన్ని, జీవితంలో కొత్త పరిచయాలకు గుర్తుగా వీటిని ఇస్తుంటారు. అంతేకాదు, తెల్ల గులాబీ.. మీ అమాయకత్వాన్ని ఎదుటి వారికి తెలియజేస్తుందట. ఇంకెందుకు ఆలస్యం.. కలికాలంలో ఈ రకం పూలకే అమ్మాయి పడుతున్నారు. సందేహమే అక్కర్లేదు. ఎదుటి వారి చేతిలో పెట్టేయచ్చు.
ఆరంజ్ గులాబీ.. ఉత్సాహం, కోరిక
మీ ఉత్సాహాన్ని, అభిరుచిని వ్యక్తపరచాలనుకుంటే.. నారింజ గులాబీలు సరైన ఎంపిక. ఎదుటి వారి పట్ల మీకున్న గాఢ ప్రేమను తెలియజేస్తాయి.
లావెండర్ రోజ్.. తొలి చూపులోనే ప్రేమ
లావెండర్ గులాబీ ఇవ్వడం చాలా అరుదు. లవ్ అట్ ఫస్ట్ సైట్(మిమ్మల్ని చూడగానే పడిపోయాను) అని చెప్పాల్సి వస్తే.. ఈ రంగును ఎంచుకోండి. లావెండర్ రంగు మీ సున్నితత్వాన్ని ఎదుటి వారికి తెలియజేస్తుంది. కాకపోతే, ఈమధ్య ఫ్లర్టింగ్ అనే పదం బాగా వినిపిస్తోంది. తొలి చూపులోనే పడిపోయా అని చెప్తే.. ఎదుటి వారు నమ్మకపోవచ్చు. ఈ ప్రయోగం దెబ్బకొట్టొచ్చు.
పీచ్ గులాబీ.. ఎదుటి వారి మంచి కోసం
ఈ రంగు గులాబీలను ఎదుటి వారికీ మంచి జరగాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఇస్తుంటారు. పీచ్ కలర్.. ఇతరుల పట్ల మీకున్న సానుభూతి, వినయాన్ని తెలియజేస్తుంది. ఈ రంగు ఎమోషన్‌ని కూడా సూచిస్తుంది. కాబట్టి.. ఎటువంటి సందేహాలు లేకుండా మీ పార్టనర్‌కి పీచ్ రంగు గులాబీ ఇవ్వొచ్చు.