కొట్టేసిన కేసుని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు: వల్లభనేని వంశీ

కృష్ణా : కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. తనకు ప్రభుత్వ రక్షణ వద్దని.. ప్రైవేటు భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరుకాకపోవడంతో తాజాగా కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

అయితే ఈ విష‌యంపై వంశీ మాట్లాడుతూ గత పదేళ్ల క్రితం హైదరాబాద్ కోర్టులో కొట్టేసిన కేసుని వైసీపీ కావాలనే కుట్రపూరితంగా కేసు తెరపైకి తీసుకువచ్చింద‌ని అన్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందొ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో తనపై నేరుగా ఢికొనలేక ప్ర‌తిప‌క్షం పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తుంద‌ని మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా ఎదుర్కొంటాన‌ని ఆయ‌న‌ చెప్పారు.