
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన విలువైన ల్యాండ్‌ను కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన ఓ ఉద్యోగి ఆక్రమించుకున్నారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ ప్రాంతంలో గల దాదాపు 400 గజాల సింగరేణి ల్యాండ్‌ను ఇటీవలే రిటైర్ అయిన ఓ ఉద్యోగి ఆక్రమించుకొని నిర్మాణం చేపట్టారు. ఈ ల్యాండ్ విలువ దాదాపు రూ. 1.50కోట్లకుపైగానే ఉంటుంది. కాగా ల్యాండ్‌ను ఆక్రమించి నిర్మాణం చేపడ్తున్న విషయాన్ని సింగరేణి ఇంటిలిజెన్స్, సెక్యూరిటీ గుర్తించాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సింగరేణి సెక్యూరిటీ ల్యాండ్ ఆక్రమణకు గురైన ప్రాంతానికి చేరుకున్నారు. ఆక్రమణతో పాటు అక్రమ నిర్మాణంపై వివరాలు సేకరించారు. సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్లు ఈ ల్యాండ్ సింగరేణిదేనని తేల్చి చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది ఈ భూమి సింగరేణికి చెందినదంటూ మంగళవారం బోర్డు పెట్టారు.