
ముంబై: వాల్యూ బయింగ్ పెరగడం, స్థూల ఆర్థిక పరిస్థితి బాగున్నట్టు సంకేతాలు రావడంతో బుధవారం (ఏప్రిల్ 2) స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 592.93 పాయింట్లు పెరిగి 76,617.44 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 655.84 పాయింట్లు పెరిగి 76,680.35 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 166.65 పాయింట్లు ఎగసి 23,332.35 వద్ద ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో వాల్యూ బయింగ్, మార్చిలో భారతదేశ తయారీ రంగ వృద్ధి ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి పెరగడం రికవరీకి సాయపడింది.
బుధవారం అమెరికా టారిఫ్ ప్రకటనలకు ముందు ఎఫ్‌ఐఐ అమ్మకాల కారణంగా సెన్సెక్స్ 1,390 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ మంగళవారం 353 పాయింట్లు పడిపోయింది. బుధవారం సెన్సెక్స్ ప్యాక్ నుంచి, జొమాటో దాదాపు 5 శాతం, టైటాన్ దాదాపు 4 శాతం పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా లాభపడ్డాయి. నెస్లే, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్ లార్సెన్ అండ్ టూబ్రో నష్టపోయాయి.
అమెరికా టారిఫ్స్ వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థపై నామమాత్ర ప్రభావాన్ని చూపుతాయనే అంచనాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను పెంచాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. పీఎంఐ ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనిపించిందని వివరించారు. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభపడగా, సియోల్, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు పెరిగాయి. ఎఫ్ఐఐలు మంగళవారం రూ.5,901.63 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. డీఐఐలు రూ.4,322.58 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.