వామనరావు దంపతుల హత్యకేసు సీబీఐకి అప్పగించాలి

వామనరావు దంపతుల హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
  • వామనరావు దంపతుల హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
  • పోలీసుల దర్యాప్తును బీఆర్ఎస్ నేత మధుకర్ ప్రభావితం చేశారు 
  • సుప్రీంకోర్టులో మృతుడి తండ్రి తరఫు అడ్వకేట్ వాదనలు
  • సీబీఐ దర్యాప్తు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మృతుడి తండ్రి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అంశంపై వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌‌‌‌ సుందరేశ్, జస్టిస్‌‌‌‌ రాజేశ్ బిందల్ తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున అడ్వకేట్ మేనక గురుస్వామి వాదిస్తూ.. వామనరావు దంపతుల హత్య కేసులో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత మధుకర్ రావు పోలీసులను ప్రభావితం చేశారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేత అయినందున ఆయనను పోలీసులు విచారించలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ లోనూ ఆయన పేరును చేర్చలేదన్నారు. అందుకే ఆ నాటి ప్రభుత్వంలో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేక సీబీఐ విచారణ కోరినట్టు బెంచ్ కు విన్నవించారు. నిందితుల తరఫున సీనియర్ అడ్వకేట్లు బసంత్, నాగముత్తు వాదిస్తూ.. రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని, గత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు.

 ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నిందితుడిపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవవి. మధుకర్ కోసం మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు. మీరు ఆయన తరఫున వాదించడంలేదు కదా. ఈ విషయాన్ని వదిలేయండి”అని నిందితుల తరఫు లాయర్లకు స్పష్టం చేసింది. అనంతరం పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న అంశంపై అభిప్రాయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లారామగిరి మండలం కలవచర్లలో కారులో కోర్టుకు వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను నడిరోడ్డుపై కిరాతంగా దుండగులు హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.