- వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఆరోపణ
- ఊరిలో మాకు ఎలాంటి కక్షలు లేవు, శత్రువులు లేరు
- సుపారీ ఇచ్చి హత్యలు చేయించి ఇప్పుడు గ్రామ కక్షలు అంటున్నరని వెల్లడి
- నిందితులను సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
- రాత్రి 11 గంటల తర్వాత మంథని కోర్టుకు తరలింపు.. 14 రోజుల రిమాండ్
- రోజంతా పోలీసుల హైడ్రామా
పెద్దపల్లి, వెలుగు: హైకోర్టు లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్య వెనుక పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు హస్తం ఉందని వామన్‌రావు తండ్రి కిషన్ రావు ఆరోపించారు. ‘‘రాజకీయ కక్షలతోనే టీఆర్ఎస్ లీడర్లు ఈ హత్యలు చేసి గ్రామ కక్షలుగా నమ్మిస్తున్నారు. ఊరిలో మాకు ఎలాంటి కక్షలు లేవు. శత్రువులు లేరు. సుపారీ ఇచ్చి హత్యలు చేయించి ఇప్పుడు గ్రామ కక్షలు అని చెప్తున్నారు’’ అని మండిపడ్డారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కిషన్‌రావు మీడియాతో మాట్లాడారు. తాను కొడుకు, కోడలు చనిపోయిన బాధలో ఉండటంతో మొదట పోలీసులు ఎట్ల చెప్తే అట్ల ఫిర్యాదు రాసిచ్చానన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడే గమనించానని, లాయర్ల ద్వారా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మళ్లీ స్టేట్మెంట్ ఇస్తానని తెలిపారు. తన కొడుకుని, కోడలిని చంపింది ముమ్మాటికీ టీఆర్ఎస్ లీడర్లేనని, రెండు హత్యలకు ప్రధాన కారణం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అని అన్నారు. హత్యల్లో పుట్ట మధు ప్రత్యక్షంగా పాల్గొనకున్నా పరోక్షంగా ఈ వ్యవహారమంతా నడిపించారని ఆయన పేర్కొన్నారు. కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
గేమ్ ప్లానర్ ఎవరో తేలాల్సిందే: బీజేపీ లీగల్ సెల్
లాయర్ల హత్య కేసులో డమ్మీలను ముందు పెట్టి కేసును పక్కదోవ పట్టించేందుకు కుట్ర జరుగుతోందని బీజేపీ లీగల్ సెల్ సభ్యులు ఆరోపించారు. ఈ మర్డర్లలో రాజకీయ కోణం ఉన్నట్లు తాము భావిస్తున్నామని, గేమ్ ప్లానర్ ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు. లాయర్లు వామన్ రావు, నాగమణి కుటుంబసభ్యులను బీజేపీ లీగల్ సెల్ సభ్యులు శుక్రవారం మంథని మండలం గుంజపడుగులో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆదేశాల మేరకు వామన్‌రావు కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికి తాము వచ్చినట్లు చెప్పారు. ఎవరికి అన్యాయం జరిగినా వామన్ రావు దంపతులు కోర్టులో పిల్ వేసేవారని, వాటిని న్యాయపరంగా ఎదుర్కోలేకే ఇలా వారిని చంపేశారని అన్నారు. వామన్‌రావు కుటుంబం తరఫున కోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ టీమ్‌లో రంగారెడ్డి జిల్లా లాయర్ పీఠం ప్రదీప్ కుమార్, బీజేపీ స్టేట్ ఈసీ మెంబర్, సీనియర్ లాయర్ కోమల ఆంజనేయులు, కరీంనగర్ బార్ ఈసీ మెంబర్ సుగుర్తి జగదీశ్వరచారి, మహిళా ప్రతినిధి తిరుమల దేవితోపాటు భాస్కర్, అమరేందర్, ఆలే నర్సింగం, రాధాకృష్ణ. మహేశ్ తదితరులు ఉన్నారు.
యూత్ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ
లాయర్లు వామన్‌రావు దంపతులను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శుక్రవారం యూత్ కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టపగలే లాయర్ల హత్య రౌడీయిజానికి, గూండాయిజానికి పరాకాష్ట అని మండిపడ్డారు. హత్యకేసులో అసలు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో మండల అధ్యక్షుడిని మాత్రమే అరెస్టు చేసి తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
పోలీసుల అదుపులో బిట్టు శ్రీను
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు మంథనిలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితులైన కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌కు బిట్టు శ్రీను తన కారు ఇచ్చినట్లు తేలింది. ఆ కారులోనే కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్ వెళ్లి లాయర్ దంపతులను హత్య చేశారని పోలీసులు తెలిపారు. పుట్ట మధు తన తల్లి పుట్ట లింగమ్మ పేరుతో నిర్వహిస్తున్న ‘పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్’కు బిట్టు శ్రీను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని గతంలో వామన్ రావు హైకోర్టులో పిల్ వేశారు.
For More News..