Vamika: మూడేళ్లకే బ్యాట్​ పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ

Vamika: మూడేళ్లకే బ్యాట్​ పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ

ఐపీఎల్ పదిహేడో సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌ల్లో 66 సగటుతో 661 పరుగులు చేసిన విరాట్.. ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. మరోవైపు, అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు అంతే. తొలి అర్ధభాగంలో ఒకే ఒక విజయాన్ని అందుకున్న బెంగుళూరు.. అనంతరం వరుసగా సంచలన విజయాలు సాధించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. మే 18న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ తన కూతురు వామికకు సంబంధించి కొన్ని వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

మిస్టర్​ నాగ్​ (దానిశ్​ సైట్​)తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. వామికకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన కుమార్తె క్రికెట్​బ్యాట్​పట్టుకుందని, దానిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ బాగాఎంజాయ్​ చేస్తోందని తెలిపారు. అయితే, తాను ఏ రంగాన్ని ఎంచుకుంటుందనేది తన ఇష్టమని అన్నారు.

"నా కూతురు బ్యాటు పట్టుకుని ఆడుకుంటోంది. బ్యాట్ స్వింగ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే తను పెద్దయ్యాక ఏం చేయాలనేది తన ఇష్టం... ’ అని ఇంటర్వ్యూలో చెబుతూ కోహ్లీ మురిసిపోయాడు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు తొలి సంతానంగా 2021, జనవరి 11న వామిక జన్మించింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఈ జంటకు మగబిడ్డ పుట్టగా, అతనికి అకాయ్​ అని పేరు పెట్టారు.

గెలిస్తే సరిపోదు..!

మే 18న శనివారం ప్లేఆఫ్స్ రేసును నిర్ణయించే మ్యాచ్‌లో ఆర్సీబీ.. చెన్నైతో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు గెలిస్తే సరిపోదు. వారు తుదిపరి దశకు చేరుకోవాలంటే మెరుగైన రన్‌ రేట్‪తో విజయం సాధించాలి. ఉదాహరణకు మొదట చెన్నై బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసిందనకుంటే.. ఆ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 11 బంతులు మిగిలుండగానే ఛేదించాలి. అదే బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్‌ దశకు అర్హత సాధిస్తుంది.