ఆమనగల్లు, వెలుగు: కేసీఆర్ దొంగ హామీలకు కాలం చెల్లిందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి గ్రామంలో ఆరు గ్యారెంటీలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో 2018 తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తన సొంత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసి ఏండ్లు గడుస్తున్నా నిర్మించలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బిక్యానాయక్, నరసింహ, ఎంపీపీ కమ్లి, వెంకటేశ్, శంకర్, జహంగీర్ బాబా పాల్గొన్నారు.