న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ (ఈగల్) కమిటీలో తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డికి అధిష్టానం చోటు కల్పించింది. 8 మందితో కూడిన కమిటీ జాబితాను ఆదివారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
దేశంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా ఈ నిపుణుల సాధికారత బృందాన్ని ఈగల్ పేరుతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీ మొదట మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధ్యయనం చేసి, లిస్టులో పేర్లు తారుమారైన తీరు తదితర అంశాలను పరిశీలించి పార్టీ అధిష్టానానికి నివేదికను అందిస్తుందని వివరించారు.
అలాగే, ఇతర రాష్ట్రాల్లోనూ గత ఎన్నికలను ఈగల్ కమిటీ విశ్లేషిస్తుందని చెప్పారు. వీటితో పాటు దేశంలో త్వరలో జరగబోయే ఎన్నికల నిర్వహణనూ పర్యవేక్షిస్తుందని ఆయన వెల్లడించారు.