- అన్న కొడుకు వంశీధర్ రావు నియామకం
- స్టేట్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు.. జిల్లాల అధ్యక్షులూ అపాయింట్
- వచ్చే నెల 1న సాంగ్లీలో పార్టీ బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు:
మహారాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్ బిజీ అయ్యారు. అక్కడ బీఆర్ఎస్ విస్తరణ, ఇతర వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. పార్టీ మహారాష్ట్ర ఇన్ చార్జ్‌గా తన అన్న కొడుకు వంశీధర్ రావును నియమించారు. అలాగే స్టేట్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఆ రాష్ట్రంలోని 36 జిల్లాలకు అధ్యక్షులను, డివిజన్లకు కోఆర్డినేటర్లు, కో–కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. 15 మందితో స్టీరింగ్‌కమిటీ ఏర్పాటు చేయగా, దీనికి కేసీఆర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో వంశీధర్‌రావు మెంబర్ గా కూడా ఉన్నారు.
మహారాష్ట్ర పాలిటిక్స్లోకేసీఆర్ బిజీ
ఈ నియామకాలకు సంబంధించి బీఆర్ఎస్ నేషనల్జనరల్సెక్రటరీ హిమాన్షు తివారీ పేరుతో శుక్రవారం ప్రకటనలు విడుదల చేశారు. మరోవైపు ఆగస్టు ఒకటిన సాంగ్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొనడానికి కేసీఆర్ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ వెళ్లి, అక్కడి నుంచి సాంగ్లీకి రోడ్డు మార్గాన వెళ్తారు. ఈ సభను సక్సెస్ చేయడానికి బీఆర్ఎస్ముఖ్య నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. కాగా, వర్షాలు, వరదలతో రాష్ట్రం ఆగమవుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్ర పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లని కేసీఆర్.. పార్టీ సభ కోసం మాత్రం మహారాష్ట్రకు వెళ్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు..
కేసీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చాడు. కేసీఆర్ అన్న రంగారావు పెద్ద కొడుకు వంశీధర్‌రావు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి రంగారావు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో సిద్దిపేట టికెట్ఆశించినా అవకాశం రాలేదు. ఆ తర్వాత కేసీఆర్‌తోనే ఉంటున్నారు. కొంతకాలంగా ప్రతి కార్యక్రమంలో కేసీఆర్‌తో పాల్గొంటున్నారు. ఇప్పటికే కేసీఆర్‌తో పాటు ఆయన కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత, అల్లుడు హరీశ్‌రావు, తోడల్లుడి కొడుకు సంతోష్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె భర్త రేగులపాటి మధుసూదన్‌రావు కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా మధుసూదన్‌రావు పని చేశారు. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటే, నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను మధుసూదన్రావే చూసేవారు. తర్వాత మధుసూదన్‌రావు అనారోగ్యం పాలవగా, రమ్యారావు కేసీఆర్‌కు దూరమయ్యారు. ఇక రంగారావు మరో కొడుకు తేజేశ్వర్రావు (కన్నారావు) వ్యాపార రంగంలో ఉన్నారు.