కోల్ బెల్ట్/చెన్నూరు, వెలుగు : విద్యార్థులు, యువ కుల ఆత్మ బలిదానాలు, సబ్బండవర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల గడీలో బందీ అయ్యిం దని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. చెన్నూరు మండలం అసనాధ్, క్యాతనపల్లి మున్సిపాలిటీ రామ కృష్ణపూర్ కాంగ్రెస్ ఆఫీస్‌లో వేర్వేరుగా జరిగిన కాంగ్రెస్ యూత్ కార్నర్ మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ స్కీమ్‌లో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఊరూరుకు బెల్ట్‌షాపులు పెట్టి నిరుద్యోగులు, యువతను తాగుడుకు బానిస చేశారని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్‌పై నిరుద్యోగులు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యలను గాలి కొదిలేసి కేసీఆర్ గడీలో బానిసగా ఊడిగం చేస్తున్న బాల్క సుమన్ ఎమ్మెల్యే ఉద్యోగాన్ని పీకేద్దాం అని పిలుపునిచ్చారు. యువకులు, నిరుద్యోగులు అందరూ ఏకమై సుమన్‌ను ఓడించాలన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ బాల్క సుమన్ వేల కోట్లు కమీషన్లుగా దండుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటువేసి గెలిపిద్దామన్నారు. సింగరేణి సిక్ ఇండస్ట్రీ పరిధిలోకి వెళ్తే వందల కోట్ల మారిటోరియం ఇప్పించి కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదేనని అన్నారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఇప్పించాడ ని, తెలంగాణ కోసం పోరాడి జైలుకు వెళ్లిండన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చాడని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్
చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎండీ యాకుబ్ అలీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం రాత్రి రామకృష్ణపూర్ కాంగ్రెస్ ఆఫీసులో వంశీ కృష్ణ యాకుబ్ అలీకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
100 మంది యువకులు కాంగ్రెస్‌లో చేరిక
చెన్నూరు మండలం అసనాధ్లో ఏర్పాటు చేసిన యూత్ కార్నర్ మీటింగ్‌లో వివిధ గ్రామాలకు చెందిన 100 మంది యువకులు వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశాల్లో ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, అక్బర్ అలీ, రఘునాథ్ రెడ్డి, మహంకాళి శ్రీనివాస్, ఎండీ అబ్దుల్ అజీజ్, పల్లె రాజు, గోపతి రాజయ్య, సత్యపాల్, రాజేశ్, శివ కిరణ్, మాజీ సర్పంచ్‌లు కొల్లూరి లచ్చన్న, అట్టెల రాజన్న, మాజీ జడ్పీటీసీ సోకుల స్వామి, యూత్ ప్రెసిడెంట్ పూర్ణచందర్, విలేజ్ ప్రెసిడెంట్ ఇంగిలి సత్యనారాయణ తదితరులు మీటింగ్‌లో పాల్గొన్నారు.