సింగరేణిని కేసీఆర్ అమ్ముకున్నడు : వంశీకృష్ణ

  • ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండు
  • ఎంపీగా గెలిస్తే కొత్త గనులు ఏర్పాటు చేయించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వెల్లడి
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలి: కోదండరాం
  • సింగరేణిలో గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు వంశీకృష్ణ, వినోద్‌‌‌‌‌‌‌‌, వివేక్‌‌‌‌‌‌‌‌ హాజరు

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. కొత్త గనులు ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసీపేట-2 సింగరేణి బొగ్గు గని వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌‌‌‌‌‌‌‌, ఏఐటీయూసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల బతుకులు బాగుపడతాయని ఆశపడితే, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్‌‌‌‌‌‌‌‌కే దక్కుతుందని ధ్వజమెత్తారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు రూ.450 కోట్లు రుణం తీసుకొచ్చి సంస్థను, లక్ష మంది ఉద్యోగులను కాపాడిన చరిత్ర కాకా వెంకటస్వామికే దక్కుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌.. నిరుద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో రాష్ట్రం నిరుద్యోగుల తెలంగాణగా మారిందని, డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం ఉపాధి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వినోద్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికులకు ఇన్‌‌‌‌‌‌‌‌కం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ మినహాయింపునకు కృషి చేస్తామని చెప్పారు. రూ.200 కోట్లతో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ.అక్బర్‌‌‌‌‌‌‌‌ అలీ, బ్రాంచ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలు దాగం మల్లేశ్‌‌‌‌‌‌‌‌, సలేంద్ర సత్యనారాయణ పాల్గొన్నారు.

బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తది: కోదండరాం

బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తదని టీజేఎస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కోదండరాం ఆరోపించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ సర్కార్‌‌‌‌‌‌‌‌ సంపన్నులను మాత్రమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దేశ సంపదను దోచిపెడ్తున్నదని మండిపడ్డారు. పెద్దపల్లిలో వంశీకృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌ ఏరియాలోని ఇందారం ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్ గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో కోదండరాంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, ఏఐటీయూసీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.

వంశీని గెలిపించండి.. అభివృద్ధి చేస్తడు: వివేక్

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మాట తప్పారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందన్నారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ రాకముందు సింగరేణిలో 62 వేల మంది ఉద్యోగులు ఉంటే.. పదేండ్లలో వీరి సంఖ్య 39 వేలకు తగ్గిందన్నారు. 23 వేల మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

 ప్రధాని మోదీ తన దోస్తులైన ఆదానీ, అంబానీలకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసి.. ప్రజలు, కార్మికులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కార్మికులకు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు లభించిందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నేతలు బాజీ సైదా, వీరభద్రయ్య, కాంగ్రెస్ లీడర్లు ఫయాజ్, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.