ఆలయాన్ని చుట్టుముట్టిన గంగమ్మ

పాపన్నపేట/పుల్కల్, వెలుగు: మెదక్​ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఇరిగేషన్​ ఆఫీసర్లు సింగూర్​ మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలడంతో వనదుర్గ ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతోంది. ఆనకట్ట పైనుంచి గంగమ్మ ఎగిసిపడుతూ ఆలయాన్ని చుట్టుముట్టింది. ముందస్తు జాగ్రత్తగా ఆఫీసర్లు, పాలకమండలి ఆలయంలో ఉన్న హుండీలతో  పాటు విలువైన సామగ్రిని ఈవో  ఆఫీసుకు తరలించారు. ఐదు రోజులుగా దుర్గమ్మకు రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నారు. 

సింగూర్ కు పెరుగుతున్న వరద ప్రవాహం

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్​కు శనివారం వరద ప్రవాహం భారీగా పెరిగింది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలతో పాటు కర్నాటక, మహారాష్ట్రలో మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 36,650 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రం వరకు మూడు గేట్లను ఎత్తి 32,086 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.350 టీఎంసీల నీరు నిల్వ ఉందని డిప్యూటీ ఈఈ నాగరాజు, ఏఈఈ మహిపాల్ రెడ్డి చెప్పారు.