
- పలు శాఖలకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, వెలుగు : ఈసారి వన మహోత్సవంలో భాగంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం పలు శాఖలకు టార్గెట్ విధించింది. బుధవారం సెక్రటేరియట్ లో వనమహోత్సవంపై అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది.
2025– 26లో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్(తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలి)’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే వన మహోత్సవంతో కలిపి సంయుక్తంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అమ్మ పేరుతో ఒక మొక్క అనే మెగా క్యాంపెయిన్ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూల్స్లో విద్యార్థులతో మొక్కలు నాటించేలా కార్యాచరణ రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది.