మెదక్ జిల్లాలో ఆకట్టుకుంటున్న వన విజ్ఞాన కేంద్రం

మెదక్ జిల్లాలో ఆకట్టుకుంటున్న వన విజ్ఞాన కేంద్రం

మెదక్, వెలుగు: మెదక్  కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వద్ద ఉన్న వన విజ్ఞాన కేంద్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. 20వ శతాబ్ది ప్రారంభంలో నిజాం రాజు మీర్​ఉస్మాన్​అలీ ఖాన్​ హయాంలో ఈ ప్రాంతాన్ని వేట విడిది కేంద్రంగా అభివృద్ధి చేశారు. అప్పట్లోనే ఇక్కడ రెండు గెస్ట్​హౌజ్​లు నిర్మించారు. 1952లో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. వివిధ రకాల వృక్షాలు, జంతువులతో జీవ వైవిధ్యానికి నిలయంగా మారిన ఈ అభయారణ్యం వద్ద ఫారెస్ట్ ప్లస్ 2. వో పథకంలో భాగంగా రూ.43.23 లక్షలతో బిల్డింగ్​ నిర్మించి అందులో వన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

అడవుల్లో ఉండే వివిధ రకాల వన్య ప్రాణులు, వాటి జీవన విధానం, వాటి వల్ల  పర్యావరణానికి కలిగే  మేలు గురించి  తెలియజేసేలా దీనిని తీర్చిదిద్దారు.  మెదక్​-కామారెడ్డి జిల్లాల పరిధిలో 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యంలో చిరుతలు, ఎలుగుబంట్లు, నీల్​గాయ్​లు, సాంబార్ లు, చుక్కల దుప్పిలు, కొండ గొర్రెలు, అడవి పందులు, అలుగులు, కుందేళ్లు, నెమళ్లు,  పోలీస్​తొండ, వివిధ రకాల సర్పాలు, కొండ చిలువలు, కొంగలు, తదితర పక్షులు ఉన్నాయి. 

Also Read :- కొమురవెల్లి పుణ్యక్షేత్రం..రైల్వేస్టేషన్‌‌‌‌గా నామకరణం

వన విజ్ఞాన కేంద్రంలో అభయారణ్యంలో ఉన్న వన్యప్రాణుల గురించి సవివరంగా తెలియజేసేలా బొమ్మలతోపాటు, స్పిన్​ బోర్డులు, ఫొటోలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచే కాక హైదరాబాద్ నుంచి స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ వందలాది మంది ఈ విజ్ఞాన కేంద్రం సందర్శనకు వస్తున్నారు. విద్యార్థులతో పాటు, ప్రకృతి ప్రేమికులను సైతం ఈ వన విజ్ఞాన కేంద్రం విశేషంగా ఆకట్టుకుంటోంది.