వనజీవి రామయ్య అంత్యక్రియలు పూర్తి..భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

వనజీవి రామయ్య అంత్యక్రియలు పూర్తి..భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు
  • నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్, వెలుగు : మొక్కలు నాటడం, వాటి సంరక్షణకే జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఖమ్మం రూరల్‌‌ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం ఖమ్మం జిల్లాతో పక్క జిల్లాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి రామయ్యకు నివాళి అర్పించారు. రామయ్య పాడెను ఏదులాపురం మున్సిపల్‌‌ కమిషనర్‌‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఖమ్మం రూరల్‌‌ తహసీల్దార్‌‌ రాంప్రసాద్‌‌ మోశారు.

నివాళులర్పించిన మంత్రి పొంగులేటి

వనజీవి రామయ్య డెడ్‌‌బాడీని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామయ్య భార్య జానమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ‘వనజీవి’గా పేరు తెచ్చుకొని, పద్మశ్రీ పొందిన రామయ్య మృతి బాధాకరం అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కలు నాటే విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదన్నారు.

మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ అనేక ప్రాంతాల్లో ఆయన మొక్కలు నాటారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌‌రెడ్డితో మాట్లాడి రామయ్య ఆశయాలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎంపీ రామసాయం రాఘురాంరెడ్డి, ఇరిగేషన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ మువ్వా విజయ్‌‌బాబు, సీపీ సునీల్‌‌దత్‌‌, రూరల్‌‌ సీఐ ముష్క రాజు పాల్గొన్నారు.