యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలోని దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచి ప్రతినెలా మొదటి వారంలోనే చెల్లించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం యాదగిరిగుట్టలోని వెలుగు కార్యాలయంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక మండల అధ్యక్షుడు మెరుగు బాబు అధ్యక్షతన జరిగిన ఎన్పీఆర్డీ మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఈనెల 25, 26న హైదరాబాద్ లోని సుందరయ్య భవన్ లో నిర్వహించే దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక 4వ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు.వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా కోశాధికారి లలిత, గౌరవాధ్యక్షుడు పోశెట్టి, ప్రధాన కార్యదర్శి నరసింహ, ఉపాధ్యక్షుడు సంతు, ఉపాధ్యక్షురాలు రాణి, సహాయ కార్యదర్శులు రాజు, మునీర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.