కొత్తగూడెం విడిచివెళ్లను

కొత్తగూడెంను విడిచివెళ్లనని.. మళ్లీ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు. తనకు కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. తనపై నియోజకవర్గంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వనమా మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తాను రాజీనామా చేస్తానంటూ ప్రచారం జరుగుతోందని.. తనపై ఓడిపోయిన వ్యక్తే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలను అయోమయానికి గురి చేయడం మంచి పద్ధతి కాదని, వెంటనే ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. 

ప్రజల వైపు ఎల్లప్పుడూ ఉండేవాడినని.. తన పని అయిపోయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని వనమా సూచించారు. కొత్తగూడెంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించానని.. ఇలాంటివి చేస్తూనే ఉంటానన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తాను కోర్టులను గౌరవిస్తానని, ఈ విషయంలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ఓడిపోయిన వ్యక్తి చెబుతూ.. తానే ఎమ్మెల్యేగా ఉంటానంటూ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని నియోజకవర్గ ప్రజలకు మరోసారి సూచించారు.