- జీతం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేకు కంప్లయింట్
- నాన్నకు ఎందుకు చెప్పినవ్
- అంటూ చేయి చేసుకున్న రాఘవ
- మనస్తాపంతో పురుగుల మందు తాగబోయిన రిషి
- అడ్డుకున్న గన్మెన్లు, సిబ్బంది
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద రిషి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. దీనికి కారణం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవనే అని తెలుస్తున్నది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ దగ్గర రిషి అనే వ్యక్తి మూడేండ్లుగా పీఏగా పనిచేస్తున్నాడు. ఇతడికి తల్లిదండ్రులు లేరు. మూడు నెలలుగా జీతం డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. రాఘవను అడిగితే అప్పుడు ఇప్పుడు అని దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. వీరి మాటలు విన్న రాఘవ కిందకు వచ్చి ‘నాన్న గారి దగ్గరకు ఎందుకు పోయినవ్.. ఆయనకు చెప్పేంత మొగోడివయ్యావా?’ అంటూ చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆయన కొంతసేపటికి ఎమ్మెల్యే ఇంటికి పురుగుల మందు డబ్బా తీసుకుని వచ్చాడు. తాగడానికి ప్రయత్నించగా అక్కడి గన్మెన్లు, సిబ్బంది అడ్డుకున్నారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కూడా వచ్చి రిషితో మాట్లాడారు. ఇంతలో ఎమ్మెల్యే వనమా జోక్యం చేసుకొని రాఘవతో సారీ చెప్పించినట్టు తెలుస్తున్నది.
ఈ ఘటనపై రాఘవ వివరణ కోరగా ‘ డ్యూటీకి ఆలస్యంగా రావడంతో తాను మందలించా. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. అంతేగాని ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదు’ అని చెప్పారు. ఎమ్మెల్యే కొడుకు రాఘవ వేధించాడని రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన రాఘవ బెయిల్పై బయటకు వచ్చారు. పార్టీ కూడా సస్పెన్షన్వేటు వేసింది. మళ్లీ ఇప్పుడు ఈ ఘటన జరగడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
కత్తి దొరికిందని ప్రచారం చేస్తున్న రాఘవ వర్గం
ఈ విషయం మీడియాకు పొక్కడంతో బయటపడేందుకు రాఘవ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్ట తెలిసింది. రిషి కత్తితో ఎమ్మెల్యే ఇంటికి రాగా రాఘవ మందలించాడని, దీంతో రిషి సీన్ క్రియేట్చేశాడని రాఘవ వర్గం ప్రచారం చేస్తున్నది. అయితే సీఐ నాగరాజును దీనిపై ప్రశ్నించగా కత్తి ఘటన గురించి, ఆత్మహత్యాయత్నం గురించి తమకు సమాచారం లేదన్నాడు.