- అర్హుల పేర్లు లేకపోవడంపై ఎమ్మెల్యే వనమా ఆగ్రహం
- కొత్తగూడెంలో 347 మందికి ఇండ్ల స్థలాలు పంపిణీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గత ఆర్డీఓ, తహసీల్దార్లకు పేదల పాపం తగులుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుంచుపల్లి మండలంలోని వనమానగర్, మాయాబజార్, ఎస్ఆర్టీ నగర్ కు చెందిన సింగరేణి భూ నిర్వాసితులతోపాటు, రైల్వే నిర్వాసితులకు మంగళవారం గంగా హుస్సేన్బస్తీలో ఎమ్మెల్యే ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ బద్మాష్ ఎమ్మార్వో చేయబట్టే కొంత మంది అర్హులైనప్పటికీ ఇండ్ల స్థలాలకు నోచుకోలేదు’ అన్నారు.
గత ఆర్డీఓ, తహసీల్దార్ ఏం చేశారని ప్రశ్నించారు. స్థలాలు దక్కనివారికి సీఎంతో మాట్లాడి ఇప్పిస్తానన్నారు. ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున 347 మందికి ఇండ్ల స్థలాలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్కంచర్ల చంద్రశేఖర్, ఆర్డీఓ శిరీష, మున్సిపల్ చైర్ పర్సన్కె.సీతాలక్ష్మి, వైస్‌చైర్మన్ దామోదర్, తహసీల్దార్ పుల్లయ్య, సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు పాల్గొన్నారు.
స్థలాలు దక్కలేదని ఆందోళన
అర్హులైన తమకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయలేదంటూ వనమానగర్, ఎస్ఆర్టీ నగర్‌కు చెందిన పలువురు మహిళలు స్టేజీ వద్ద ఆందోళనకు దిగారు. ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నామని, ఇంటి, నల్లా పన్నుల రశీదులున్నాయని వాపోయారు. తమ పేర్లు ఎందుకు చేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఎమ్మెల్యే హామీతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.