భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : శంకుస్థాపన చేసిన పనులకే మరోసారి శంకుస్థాపన చేస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడ్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలలో చేపట్టిన డెవలప్ మెంట్ వర్క్స్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా గత నెల మూడో వారంలో ప్రారంభించారు. వారం రోజుల తర్వాత వాటినే ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే వనమా మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన ప్రతిచోట సభలు పెట్టిస్తుండడంతో అటు ఆఫీసర్లతో పాటు ఇటు కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు..
కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలో దాదాపు రూ. 135 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే వనమా గత నెల 24న శంకుస్థాపన చేశారు. కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్, రామవరం ప్రాంతాలతో పాటు పాల్వంచ పట్టణంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులకు భూమి పూజా చేశారు.
Also Raed :- వరంగల్ కేఎంసీలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. మెట్టెవాడ పీఎస్లో ఆరుగురు సీనియర్లపై కేసులు
కొత్తగూడెం పట్టణంలోని రామవరంతో పాటు పాల్వంచలో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఎమ్మెల్యే రెండోసారి శంకుస్థాపనలు చేయడంపై సొంత పార్టీ కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆఫీసర్లు, కౌన్సిలర్లకు తలనొప్పి..
ఒక్క వార్డులో మరోసారి డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసే క్రమంలో ఆయా ప్రాంతాల్లో మీటింగ్‌లు పెడ్తున్నారు. వార్డు ప్రజలను మీటింగ్‌కు తీసుకురావాలని కౌన్సిలర్లను ఎమ్మెల్యే ఆదేశిస్తున్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చిన తర్వాతే ఎమ్మెల్యే అక్కడకు వస్తుండడం గమనార్హం. ప్రజలు ఎక్కువగా రాకపోతే ఆ కౌన్సిలర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. టెంట్లు వేయడం, జన సమీకరణ అటు కాంట్రాక్టర్లతో పాటు ఇటు ఆఫీసర్లు, కౌన్సిలర్లకు తలనొప్పిగా మారింది.
చేసిన పనులకే ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తుండడంతో ఇతరత్రా పనులు చేసుకోలేక పోతున్నామని పలువురు ఆఫీసర్లు వాపోతున్నారు. ప్రతి రోజు మూడు నాలుగు చోట్ల శంకుస్థాపనలు చేస్తూ మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా ఎన్నికల ప్రచారాలు చేపడ్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా శిలాఫలకాలు లేకుండా ఖాళీ దిమ్మల వద్దే పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తుండడం పట్ల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.