- డీఆర్డీవో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకం
- శాఖల వారీగా లక్ష్యాలు కేటాయింపు
మెదక్, వెలుగు: పచ్చదనం పెంపొందింపజేసేందుకు ఉద్ధేశించిన వనమహోత్సవ కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఈ సీజన్లో వనమహోత్సవం కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా 34,08,200 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ల వారీగా లక్ష్యాలు కేటాయించారు. వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా అటవీ శాఖ సిద్ధం చేశాయి. డీఆర్డీవో ఆధ్వర్యంలో జిల్లాలోని 469 గ్రామ నర్సరీల్లో మొక్కలు పెంచారు.
మరోవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీల్లోనూ మొక్కలు పెంచారు. ఆయా నర్సరీల్లో గుల్మోహర్, కానుగ, టేకు, చింత, వేపతో పాటు ఇంటి ఆవరణలో పెంచుకునే వివిధ రకాల మొక్కలు పెంచి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో గుంతలు తీసే పనులు కొనసాగుతున్నాయి. వర్షాలు కురియగానే వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్, కాలేజీ, గురుకుల ప్రాంగణాలు, చెరువు గట్లు, నేషనల్, స్టేట్హైవేలు, గ్రామీణ రోడ్ల వెంట, అటవీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక గ్రామాల్లో ఇంటి ఆవరణలో పెంచేందుకు వీలైన మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయనున్నారు.